అనంతపురం కల్చరల్: అద్భుతమైన చరిత్రకు ప్రతిరూపంగా రాసిన ‘కడపటి యుద్ధం’ మరో చరిత్రను సృష్టిస్తుందని మాజీ వీసీ, డాక్టర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణస్వామి రాసిన కడపటి యుద్ధం నవలను ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్ వేదికగా స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కవి తూముచర్ల రాజారామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రజాకవి గోరేటి వెంకన్న, సాహితీ విమర్శకుడు భూమన్, అజూ పబ్లికేషన్స్ శ్వేత, డాక్టర్ అంకే శ్రీనివాస్, వర్దిల్లి వెంకటేశ్వర్లు, పద్మాకర్, చంద్రశేఖరశాస్త్రి తదితరులు ఉదయం సభలో ముఖ్య అతిథులుగా మాట్లాడారు. హంపీ విజయనగర వైభవం, తళ్శికోట యుద్ధం ఘట్టాలతో పాటు విశిష్టాధ్వైత మూలాల ప్రస్తావనను రచయిత సమర్థవంతంగా చిత్రీకరించారని కొనియాడారు. అలాగే మధ్యాహ్నం సభకు డాక్టర్ వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య, ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. జీవిత వాస్తవికత కల్గిన పాత్రలతో రాసిన నవలలో అనేక ఆధారాలను చేర్చిన విషయం అభినందనీయమన్నారు. ఉప్పరపాటి వెంకటేశులు, ద్విభాషా కవి జూటూరు షరీఫ్, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పేరిందేవి, చెట్ల ఈరన్న, రియాజుద్దీన్, అశ్వర్థరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జింక వరుణ్ తదితరులు రచయితను ఘనంగా అభినందించారు.


