అనంతపురం అర్బన్: ఇరాన్– ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా వంట గ్యాస్ సరఫరాలో సంక్షోభం తలెత్తింది. వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఇక గృహావసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లకు కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్స్‌తో కుమ్మకై ‘బ్లాక్ దందా’ సాగిస్తున్నారు. హోటళ్లకు, టీస్టాళ్లకు డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కొక్క సిలిండర్‌కు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ దాడులు పెరగడంతో అక్రమార్కులు రహస్య ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లను నిల్వచేసి రాత్రి వేళల్లో తమ ‘కస్టమర్ల’కు అందజేస్తున్నట్లు సమాచారం.
గ్యాస్ దందా ఇలా...
గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాలో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు డెలివరీ బాయ్స్ తమ కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పేరిట గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆ కనెక్షన్ల ద్వారా రీఫిల్ బుక్ చేసుకోవడం.. వాటిని హోటళ్లు, ఇతర కమర్షియల్ అవసరాలు ఉన్న వారికి రెట్టింపు ధరకు విక్రయించి సొమ్ము చేకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ వినియోగదారు 45 రోజులు, పట్టణ వినియోగదారు 25 రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేసుకోవాలని నిబంధన విధించారు. ఇదివరకు ఈ నిబంధన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా బుక్ చేసుకోవడం.. సిలిండర్లు పొందడం.. ఎక్కువ ధరకు అమ్ముకోవడం పరిపాటిగా మారిపోయింది. వీరితోపాటు కొందరు వ్యక్తులు సంపాదన కోసం అనధికారిక గ్యాస్ సిలిండర్ల వ్యాపారం ఎంచుకున్నారు. వీరు కుటుంబ సభ్యులు, బంధువర్గీయుల పేరిట గ్యాస్ కనెక్షన్లు తీసుకోవడం.. తద్వారా రీఫిల్ పొంది సిలిండర్లతో పాటు లూజుగా కిలోల చొప్పున భారీ మొత్తంలో విక్రయించుకుంటున్నారు. ఇలాంటి కనెక్షన్లు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
వినియోగదారులకు తప్పని పాట్లు..
అక్రమార్కులు – డెలివరీ బాయ్స్ ఇష్టారాజ్య గ్యాస్ కనెక్షన్ల ప్రభావం సాధారణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా సాఫీగా సాగుతున్నపుడు ఎవరికీ ఇబ్బంది ఎదురవలేదు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో సరఫరా మందగించడం.. ఆన్‌లైన్ బుకింగ్ మొరాయించడంతో సిలిండర్లు దొరక్క పడరాని పాట్లు పడుతున్నారు. అక్రమార్కులు– డెలివరీ బాయ్స్ చాకచక్యంగా వారి కనెక్షన్ల పేరిట బుకింగ్ చేసుకోవడంతో పాటు సాధారణ వినియోగదారులకు కేటాయించిన రీఫిల్‌ను కూడా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులకు ఆలస్యంగా సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఫోన్ ఎత్తితే ఒట్టు..
ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు బిల్ జనరేట్ అయినా గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదు. వినియోగదారులు డెలివరీ బాయ్స్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. రోజుల తరబడి ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా ఒత్తిడితో ఎత్తడం లేదేమో అని సరిపెట్టుకుంటున్నారు. దీన్నే అదునుగా చేసుకున్న ‘బాయ్స్’ వారికి కేటాయించిన సిలిండర్లను తమకు కావలసిన వారికి సర్దుబాటు చేస్తున్నారు. ఒక వేళ ఫోన్ ఎత్తితే ఒక వారం ఆగండి వస్తుంది అంటూ సెలవిస్తున్నారు.
వంట గ్యాస్ పక్కదారి..
డెలివరీబాయ్స్, అక్రమార్కుల దందా
హోటళ్ల నిర్వాహకులతో కుమ్మక్కు
సిలిండర్ రూ.2,500 వరకు విక్రయం
విజిలెన్స్ దాడులతో వెలుగులోకి బాగోతం


