ఈవీ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్న అనంతపురంలోని బళ్లారి రోడ్డులో ఉన్న సబ్‌స్టేషన్
జిల్లాలో 10 ప్రాంతాల్లో ఏర్పాటుకు చర్యలు
రూ.7 కోట్లతో అభివృద్ధి పనులు
ఎలక్ట్రిక్ వాహనదారులకు ఊరట
విద్యుత్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్‌న్యూస్. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (నెడ్‌క్యాప్) సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద విద్యుత్ వాహన చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. సరిపడా ఖాళీ స్థలమున్న సబ్‌స్టేషన్ల పరిధిలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాయి. విద్యుత్ వాహనదారుల డిమాండ్‌కు అనుగుణంగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేలా రెండు సంస్థల అధికారులు చర్యలు చేపట్టారు.
అనంతపురం టౌన్: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రేజ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ తర్వాత, ఎక్స్‌వీ 9ఈ, బీఈ 6ఈ వంటి పవర్‌ఫుల్ వాహనాలను భవిష్యత్త అవసరాలకు అనుగుణంగా మహీంద్రా మోటార్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇక ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లోనూ ఓలా, హోండా, హీరో, ఏథర్ తదితర కంపెనీలు తమ కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. దీంతో భవిష్యత్‌లో పెరిగే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ చార్జింగ్ పాయింట్ల అవసరమూ చాలా ఉంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద సొంత ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇందు కోసం 10 విద్యుత్ సబ్‌స్టేషన్లను గుర్తించారు. తొలి విడతలో భాగంగా రూ.7 కోట్ల నిధులతో జాతీయ రహదారుల పక్కనే ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల ఖాళీ స్థలాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.
చార్జింగ్ పాయింట్ల వద్దనే క్యాంటీన్లు
ఇప్పటికే గుత్తి నుంచి తాడిపత్రికి వెళ్లే మార్గంలోని 67వ జాతీయ రహదారిపై రాయలచెరువు, 44వ జాతీయ రహదారిపై మిడుతూరు, హంపాపురం, చైన్నె మార్గంలోని 42వ జాతీయ రహదారిపై ఇటుకలపల్లి, అనంతపురంలోని విద్యుత్ శాఖ డీ–5 సెక్షన్ (బళ్లారి బైపాస్), ఉరవకొండ, కూడేరు, రాయదుర్గంకు వెళ్లే మార్గంలోని కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది. ఆయా విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న చార్జింగ్ పాయింట్ల వద్ద వాహనదారుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్లనూ ఏర్పాటు చేయనున్నారు. అక్కడున్న ఖాళీ స్థలాన్ని బట్టి పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మార్చి ఆఖరు లోపు కొన్ని, మే ఆఖరులోపు మిగిలినవన్నీ పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు.


