ఏసీబీ ఇన్‌స్పెక్టర్ అంటూ దందా
● కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు
రాప్తాడురూరల్: ఏసీబీ ఇన్‌స్పెక్టర్ హమీద్‌ఖాన్ అంటూ పలువురికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు వసూలు చేసిన కేటుగాడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శేఖర్ మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చెర్లోపల్లికి చెందిన వైదం మహేష్ ప్రైవేట్ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆర్థిక అవసరాలు ఎక్కువ కావడంతో వాటిని తీర్చుకునేందుకు నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తాడు. ఈక్రమంలో ఇన్‌స్ట్రాగాంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ హమీద్‌ఖాన్ ఫొటోను డౌన్‌లోడ్ చేసుకుని డీపీగా పెట్టుకున్నాడు. అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్‌కు చెందిన శివరామ్ అనే వ్యక్తి పాతకార్ల అమ్మకాలు, కొనుగోలు వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల శివరామ్‌కు ఫోన్ చేసిన వైదం మహేష్ ‘ఏసీబీ సీఐ హమీద్‌ఖాన్’గా పరిచయం చేసుకున్నాడు. కార్ల వ్యాపారం నిబంధనల మేరకు చేయడం లేదంటూ బెదిరించి రూ.4,500 తన ఖాతాకు వేయించుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వైదం మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. శివరామ్‌తో పాటు అనంతపురంలో మరో వ్యక్తితో రూ.1,300, తాడిపత్రిలో ఇంకో వ్యక్తితో రూ.19 వేలు ఇలానే బెదిరించి వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.
ఎస్కేయూలో పైసా వసూల్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చిరుద్యోగులకు జీతాలు పెంచుతామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ మినిమం స్కేలు ఉద్యోగులు 220 మంది మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. నామమాత్రపు జీతంతో చేరిన వీరికి ప్రస్తుతం రూ.15,850 ఇస్తున్నారు. ఎన్నో దఫాలుగా జీతాలు పెంపుదల చేయాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విన్నవిస్తూ వచ్చారు. గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి హయాంలో రూ.4 వేలు జీతం పెంపుదల చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇందుకు నిరాకరించారు. దీంతో ఆ అంశం మరుగునపడింది. తాజాగా రూ.5వేలు చొప్పున జీతం పెంపుదల చేస్తామంటూ మినిమం స్కేల్ ఉద్యోగుల్లో కొందరు దళారీ అవతారమెత్తారు. అమరావతి సెక్రెటేరియట్‌లో ఉన్నత విద్య విభాగం నుంచి జీఓ తీసుకు రావడానికి డబ్బు ఖర్చు అవుతుందంటూ.. ఇందుకు గాను ఒక్కొక్కరు రూ.10వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా అందరూ కలిసి ముందుకు వస్తేనే పెంపుదల సాధ్యమవుతుందని నమ్మబలికారు. ‘సార్’ (యూనివర్సిటీ కీలకాధికారి) చెప్పారు.. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరైనా ఇవ్వకపోతే ఉద్యోగుల జాబితా నుంచి పేరు తీసివేయిస్తామని, పెరిగిన జీతం ఇచ్చేది ఉండదని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఐదారుగురు మినహా మిగిలిన అందరూ ఫోన్‌పే, నగదు రూపంలో మొత్తం రూ. 21.50 లక్షల దాకా చెల్లించారు. ఈ డబ్బు వసూలులో ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. సెక్రటేరియట్‌లో జీఓ తేవడానికి డబ్బు వసూలు చేయాల్సిన అవసరం లేకున్నా.. ఇలా అనధికారికంగా వసూళ్లకు పాల్పడటం.. కీలకాధికారి పాత్ర ఉండటం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.
జీతం పెంచుతామని చిరుద్యోగులకు ఎర
ఒక్కొక్కరితో రూ.10వేల చొప్పున కలెక్షన్
వర్సిటీ కీలకాధికారి కనుసన్నల్లోనే వ్యవహారం


