పప్పుశనగ రైతు కష్టాలు పట్టని మంత్రి
ఉరవకొండ: రబీ సీజన్‌లో పప్పుశనగ సాగు చేసిన రైతుల కష్టాలు మంత్రి పయ్యావుల కేశవ్‌కు పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు విమర్శించారు. పంట దిగుబడులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ రైతులను నష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పప్పుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆదేశాలతో బుధవారం ఉరవకొండలోని ఏడీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బోయ సుశీలమ్మ మాట్లాడుతూ... జిల్లాలోనే అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, విడపనకల్లు, బెళుగుప్ప, ఉరవకొండ మండలాల్లో పప్పుశనగ సాగును రైతులు సాగు చేస్తుంటారని పేర్కొన్నారు. పక్షం రోజుల క్రితమే కోతలు పూర్తి చేసి పంట దిగుబడులను పొలాల్లో రైతులు నిల్వ చేశారన్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని, దీనికి తోడు పప్పుశనగ రైతుల కష్టాలను మంత్రి పయ్యావుల కేశవ్ పట్టించుకోకపోవడంతో దళారులు చెలరేగిపోతున్నారన్నారు. క్వింటా రూ.4 వేల చొప్పున అడుగుతుండడంతో రైతులు నష్టానికే పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి క్వింటా రూ.7వేలతో పప్పుశనగ కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈఓ భరత్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ మండల, రూరల్ కన్వీనర్లు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, వజ్రకరూరు కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి, రూరల్ పరిశీలకులు డిష్ సురేష్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, నాయకులు దయ్యాల నాగరాజు, శ్రీనివాసులు, చిదంబరి, ఈశ్వర్, షెక్షానుపల్లి రమేష్, మోపిడి ప్రసాద్, వడ్డె ఆంజనేయులు, జోగి హనమంతు, పచ్చి రవి, మహనంది తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం పనికిరాదు
క్వింటా రూ.7 వేలతో కొనుగోలు చేయాలి
ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నాలో వైఎస్సార్‌సీపీ నేతలు


