రైతులకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు
అనంతపురం అర్బన్: అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం వెనుపోటు పొడుస్తూనే ఉందని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున విమర్శించారు. బుధవారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్, ఇతర నాయకులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి సరిపడ నిధులు కేటాయించకుండా పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్నదాత సుఖీభవ, విత్తన రాయితీ, పంటల బీమా, వడ్డీ రాయితీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ప్రకృతి విపత్తుల పరిహారం, ధరల స్థిరీకరణ వంటి కీలక అంశాలకు సైతం సరైన నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే రైతుల విషయంలో చంద్రబాబు సర్కారు ఎంత నిర్ధయగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీలు తగ్గించడంతో రైతులపై తీరని ఆర్థిక భారం పడుతోందన్నారు. యూరియా అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారన్నారు. పీఎం కిసాన్ పథకాన్ని రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ నెల 23న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బండి రామకృష్ణ, రవీంద్ర, బాషా, వీరనారప్ప, తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో అన్యాయం
23న జిల్లావ్యాప్తంగా నిరసనలు
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున


