అభివృద్ధి పనులు పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం
అనంతపురం అర్బన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అభివృద్ధి పనులపై బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, మైనర్ ఇరిగేషన్, తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రోడ్లు, బ్రిడ్జిలు, విలేజ్ హెల్త్ క్లీనిక్ భవనాల నిర్మాణ పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి సంబంధించి స్థల సమస్యలను పరిష్కరించాలన్నారు. మార్చిలోపు ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) స్కీమ్ పనులు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల కింద మంజూరైన పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌కు సంబంధించి 342 పూర్తయ్యే దశలో ఉండగా, 42 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీఎంశ్రీ, పీఎంఅజయ్, ఆర్థిక సంఘం, ఎంపీ ల్యాడ్స్, సాస్కి, జలజీవన మిషన్, తదితర పథకాలకు సంబంధించిన పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, సీపీఓ అశోక్‌కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, పీఆర్ ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి,హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ సుధాకర్‌రావు, ఇతర అధికారులు పాల్గొనారు.


