వచ్చే ఖరీఫ్‌లో సరికొత్త ఈ–క్రాప్ యాప్
● రైతే స్వయంగా పంట నమోదు చేసుకునే అవకాశం
అనంతపురం అగ్రికల్చర్: వచ్చే ఖరీఫ్ నాటికి డిజిటల్ క్రాప్ సర్వే (పంట నమోదు)కు సంబంధించి సరికొత్త యాప్ అందుబాటులోకి రానుందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ముదిగల్లు రవి మంగళవారం తెలిపారు. సాగు చేసిన పంట పొలాలను రైతే స్వయంగా తమ మొబైల్ ఫొన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పంట నమోదు చేసుకునే వెసులుబాటు రానుందన్నారు. దీని వల్ల ఆర్‌ఎస్‌కే సిబ్బందిపై పనిభారం తగ్గడంతో పాటు కచ్చితమైన పంట సాగు వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. రైతు నమోదు చేసిన ఈ–క్రాప్‌ను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో సరిపోల్చనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సరికొత్త యాప్ ట్రయల్ రన్‌లో ఉందన్నారు. ఇకపోతే ఈ రబీలో పంట నమోదులో అనంతపురం జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఫిబ్రవరి 28లోపు వంద శాతం పూర్తి చేయడంపై దృష్టి సారించామన్నారు. ఆర్‌ఎస్‌కే సిబ్బంది చేసిన పంట నమోదు కచ్చితంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ప్రస్తుతమున్న యాప్‌ను నవీకరించారని తెలిపారు. రైతు సెల్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్ లేదా వెబ్ లింక్స్ ఉపయోగించుకుని సరిచూసుకోవచ్చని, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకునే వీలుందని పేర్కొన్నారు.
వచ్చే ఖరీఫ్‌లో సరికొత్త ఈ–క్రాప్ యాప్


