దగ్గుపాటి అనుచరుడు గంగారాం అరెస్ట్
అనంతపురం సెంట్రల్: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు కోనంకి గంగారాంను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం షాప్‌కు నిప్పంటించిన కేసులో అతనితోపాటు ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్టు వివరాలను నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జగదీష్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న అర్ధరాత్రి దాటిన తర్వాత జాతీయ రహదారిలోని నంబూరి వైన్స్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. పెట్రోల్‌పోసి నిప్పంటిస్తున్న తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ కేసులో ఇప్పటికే లక్ష్మీనగర్‌కు చెందిన మోహన్‌కుమార్, అతని తమ్ముడు అఖిల్‌కుమార్, కళావతి కొట్టాలకు చెందిన బాబాఫక్రుద్దీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ప్రధాన నిందితుడైన నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన కోనంకి గంగారాం, అతని డ్రైవర్లు రుద్రంపేటకు చెందిన వీరేంద్రబాబు, డొక్కా హరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
పెచ్చుమీరిన ఆగడాలు..
ఎమ్మెల్యే దగ్గుపాటి ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్న గంగారాం ఆగడాలు నగరంలో పెచ్చుమీరిపోయాయి. అందులో భాగంగా ఇటీవల రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ ఎగ్జిబిషన్ నిర్వాహకున్ని బెదిరించాడు. అలాగే వాటా ఇవ్వలేదని జాతీయ రహదారి పక్కన ఉన్న నంబూరి వైన్స్ షాపునకు నిప్పు పెట్టించాడు. మరో టీడీపీ మహిళా నేత బంధువులకు చెందిన స్థలం కబ్జాకు యత్నించాడు. ఈ మూడు ఘటనలపై గంగారాంపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
అంతా హైడ్రామా..
మద్యం షాపునకు నిప్పు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీన్ని ఎస్పీ జగదీష్ సీరియస్‌గా తీసుకున్నారు. అయితే కేసులు నమోదైన వెంటనే గంగారాం, అతని అనుచరులు జిల్లా నుంచి పరారయ్యారు. ఇతర రాష్ట్రంలో తలదాచుకున్న గంగారాంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి, జిల్లాకు తీసుకొచ్చారు. మీడియా ఎదుట హాజరుపరుస్తారని అందరూ భావించారు. అయితే శనివారం నుంచి హైడ్రామా నడిచింది. చివరకు సెలవు దినమైన ఆదివారం న్యాయమూర్తి నివాసంలో గంగారాంను హాజరుపరిచారు.
అరాచకాలలో ఉద్యోగుల పాత్ర!
ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలలో ఆయన వద్ద పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాలు పంచుకుంటున్నట్లు మరోసారి నిరూపితమైంది. ఎగ్జిబిషన్ నిర్వాహకున్ని బెదిరించేందుకు స్వయంగా ఎమ్మెల్యే దగ్గుపాటి గన్‌మెన్ షెక్షావలి వెళ్లడాన్ని ఎస్పీ జగదీష్ తీవ్రంగా పరిగణించారు. ఆయన్ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. ఆదివారం ప్రధాన నిందితుడు గంగారాం అరెస్ట్ – రిమాండ్ తరలింపు సమయంలో టీడీపీ నాయకులు కాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ శ్రీరాములు (డీఆర్‌డీఏ–వెలుగు ఏపీఎం) పాల్గొనడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఇటీవల గంగారాం దౌర్జన్యాల వెనుక ఎమ్మెల్యే హస్తమున్నట్లు పత్రికలతో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆరోపించడంపై దగ్గుపాటి తీవ్రస్థాయిలో స్పందించారు. వారి గొడవలతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అయితే నగరంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు తదితర ఘటనలన్నింటిలో ఆయన సహాయకులు పాల్గొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అన్ని నేరాల వెనుక ఎమ్మెల్యే ఉన్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
వైన్స్ షాప్‌కు నిప్పంటించిన కేసు..
ఇద్దరు డ్రైవర్లు వీరా,
హరి కూడా అరెస్ట్
ముగ్గురికీ 14 రోజుల రిమాండ్
విధించిన మెజిస్ట్రేట్


