జూద కేంద్రాల నియంత్రణలో విఫలం
తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలో మట్కా, పేకాట వంటి జూద కేంద్రాలను నియంత్రించడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో ఏ వీధిలో చూసినా మట్కా, పేకాట స్థావరాలు కనిపిస్తున్నాయన్నారు. సామాన్య ప్రజలు జూదాల వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మట్కా, పేకాట నిర్వాహకుల నుంచి మామూళ్ల కోసం గొడవలకు దిగుతున్నారన్నారు. గ్యాంగ్‌వార్‌లు జరుగుతున్నా పోలీసులు కేసులు నమోదు చేయడానికి జంకుతున్నారన్నారు. పోలీస్ అధికారులు జేసీకి కొమ్ముకాస్తూ రౌడీ మూకలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా.. వారిపైనే కేసులు నమోదు చేస్తామని భయపెడుతున్నారని తెలిపారు. ఇక సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారని వైఎస్సార్‌సీపీ నాయకులను చిత్రహింసలు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ వారు సోషల్‌మీడియాలో పెట్టిన పోస్టులు పోలీసులకు ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. జిల్లా పోలీస్ అధికారులు తాడిపత్రి వైపు దృష్టి సారించి జూద కేంద్రాలను నియంత్రించి, గ్యాంగ్‌ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఏ వీధిలో చూసినా మట్కా, పేకాటే
తాడిపత్రిని జూదకేంద్రంగా మార్చేశారు
పట్టించుకోని పోలీసులు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజం


