ఆదిత్యాయ నమః
అనంతపురం కల్చరల్: రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం జిల్లా వ్యాప్తంగా సామూహిక సూర్యనమస్కారాతో నీరాజనాలర్పించారు. వివేకానంద యోగకేంద్రం ఆధ్వర్యంలో తెల్లవారుజామున నగరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సామూహిక సూర్యనమస్కార యజ్ఞం జరిగింది. నిర్వాహకులు యోగా విశిష్టతను, సూర్యనమస్కారాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా శిక్షకులు సూర్యభగవానుని స్తుతిస్తూ సాగిన మంత్రాలకనుగుణంగా వందలాది మంది యోగా సాధకులు 108 సామూహిక నమస్కారాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ ఇంజినీరు శ్రీరాం సుధాకర్, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షుడు మెళవాయి రాజశేఖరరెడ్డి తదితరులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఒత్తిడి నిండిన జీవితానికి యోగా మాత్రమే పరిష్కారమార్గమన్నారు. రోజూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల చక్కటి వ్యాయామంతో పాటూ రోగాలు దరిచేరవని, మనసు ఉల్లాసంగా ఉంటుందన్నారు. అనంతరం యోగా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులనందించారు.
ఆదిత్యాయ నమః


