16 మందికి కారుణ్య నియామకాలు
అనంతపురం అర్బన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడం ద్వారా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆనందం నింపారు. మొత్తం 16 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌ఓ మలోల శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జీఓ మేరకు వీరిని సచివాలయల ఉద్యోగులుగా, ప్రభుత్వ శాఖల్లో అటెండర్లుగా నియమించారు.
22న జిల్లావ్యాప్తంగా
ఆందోళనలు
● వామపక్ష పార్టీ నాయకులు
అనంతపురం అర్బన్: ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ పేరు మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 22న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నేతలు వెల్లడించారు. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఎం (ఎంఎల్ న్యూ డెమోక్రసీ), ఎస్‌యూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప్ప, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పని హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చి ఒక సాధారణ పథకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని మండిపడ్డారు. పథకానికి నిధులు, పని దినాలు, దినసరి కూలి పెంచి ఉపాధి కూలీల జీవితాల్లో వికాసం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పథకం అమలును రాష్ట్రాలకు అప్పగిస్తే నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా 22న చేపట్టిన ఆందోళనలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
వ్యక్తి దుర్మరణం
గార్లదిన్నె: మండలంలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండలం సిద్ధలాపురం గ్రామానికి చెందిన బండారు ఆదినారాయణ(38) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై పెద్దవడుగూరు మండలం మిడతూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ తలగాచిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టమాట లోడ్‌తో మహారాష్ట్రకు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రొబేషనరీ ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపారు.
16 మందికి కారుణ్య నియామకాలు


