సబ్సిడీ విత్తన వేరుశనగలో రాళ్లు
బ్రహ్మసముద్రం: రబీ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగలో నాణ్యత కొరవడింది. శుక్రవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలోని రైతు సేవ కేంద్రం (ఆర్‌ఎస్‌కే) నుంచి ఓ రైతు సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకున్నాడు. 30 కిలోల బస్తాకు రూ.1,650 చొప్పున వసూలు చేశారు. అయితే ఈ బస్తాలో కిలో వరకు రాళ్లు ఉండటంతో రైతు కంగుతిన్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా పంపిణీ చేస్తే ఎలా అంటూ వాపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సీఐని దూషించిన
ఘటనలో నలుగురిపై కేసు
ఉరవకొండ: ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది విధులకు ఆటంకం కలిగిస్తూ దూషించిన ఘటనలో బీజేపీకి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు శుక్రవారం తెలిపారు. భూతగాదా విషయంలో ఇటీవల విడపనకల్లు పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైందని, దీనిపై విచారణకు రావాలంటూ బీజేపీ నేతలకు సీఐ ఫోన్‌లో తెలిపారన్నారు. బీజేపీ నాయకులు ఈ నెల 18న ఉరవకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఒక్కసారిగా సీఐపై చిందులు వేస్తూ తీవ్రంగా దూషించారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆ నాయకులను వారించినా వినలేదని తెలిపారు. దీనిపై విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన బీజేపీ నాయకులు సందిరెడ్డి నారాయణస్వామి, సందిరెడ్డి వెంకటరమణ, నింబగల్లుకు చెందిన జట్టి గోపాల్, మోపిడికి చెందిన దగ్గుపాటి శ్రీరాములుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
నేడు జిల్లాస్థాయి
విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన
అనంతపురం సిటీ: రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్‌ఫేర్) నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు తమ ప్రాజెక్టులతో సంబంధిత గైడ్ ఉపాధ్యాయులతో కలిసి ఉదయం 9 గంటలకల్లా రాప్తాడుకు చేరుకోవాలని సూచించారు. గ్రూప్, వ్యక్తిగత, ఉపాధ్యాయ విభాగంలో జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 23వ తేదీన నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్‌కు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
‘దుర్గం’ పోలీసులకు
ఏబీసీడీ అవార్డు
అనంతపురం/రాయదుర్గం: రాష్ట్రస్థాయి ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును రాయదుర్గం పోలీసులు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచే కేసుల వివరాల ఆధారంగా ప్రతి మూడు నెలలకోసారి ‘ఏబీసీడీ’ ప్రకటిస్తారు. ఈ క్రమంలో కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్‌లను ఆపరేట్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా భారీగా ఫేక్ అకౌంట్లలోకి నగదు బదలాయించిన గుట్టును రట్టు చేసినందుకు గాను రాయదుర్గం యూపీఎస్, రాయదుర్గం రూరల్, జిల్లా సైబర్ విభాగం పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఐదుగురు సభ్యులు గల సైబర్ ముఠాను అరెస్ట్ చేసి రూ.41.20 లక్షల నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, కారు, 20 ఏటీఎం సిమ్‌కార్డులు, 15 సిమ్ కార్డులు, 10 చెక్కుబుక్కులు, రెండు రూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా చేతుల మీదుగా అవార్డును అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ పి. జగదీష్ అందుకున్నారు.
సబ్సిడీ విత్తన వేరుశనగలో రాళ్లు


