ప్రశాంతంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం నేడు పేకాటకు కేరా
గుంతకల్లు: సులువుగా సంపాదించడం కోసం కొందరు జూదం బాట పడుతున్నారు. సంపాదన మొత్తం ఇందులో తగలేసి కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. జూదంలో ఒకటైన పేకాట కోసం గుంతకల్లు నియోజకవర్గంలోని వారు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి, రాయచూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది. పేకాట స్థావరాలు స్థానికంగా ఉంటే వ్యాపారం మరింత ఎక్కువగా సాగుతుందని, నిర్వాహకులకు కావల్సినంత ఆదాయం సమకూరుతుందని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు – ప్రజాప్రతినిధులు ఆలోచించినట్టుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే గుంతకల్లు నియోజకవర్గాన్ని పేకాట స్థావరంగా మార్చేశారు. ఆదాయం భారీగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన వారు పోటీపడి పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లు పట్టణం, మండలంతో పాటు గుత్తి, పామిడి మండలాల్లోనూ విస్తరించారు. ఇప్పుడు రాయలసీమతో పాటు బళ్లారి నుంచి సైతం జూదరులు పేకాట ఆడేందుకు గుంతకల్లుకు వస్తున్నారు. దీంతో పేకాట మూడు పువ్వులు– ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పేకాట ఆడేందుకు వచ్చిన వారికి అక్కడే మందు, మాంసాహారం, సిగరెట్లు తదితర సకల సౌకర్యాలూ సమకూర్చడంతో ఒక్కో శిబిరం వద్ద రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు సాగుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న పేకాట శిబిరాలకు ‘స్థానిక పోలీసుల’ నుంచి ఇబ్బందులు రాకుండా తనే మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం.
దాడులతో అలజడి
గుంతకల్లు నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెలిసిన పేకాట శిబిరాలు, స్థానిక పోలీసుల ఉదాసీనత గురించి ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సారథ్యంలోని ఎస్‌ఓజీ స్క్వాడ్ ఇటీవల పలు చోట్ల దాడులు చేయడంతో స్థానికంగా అలజడి రేగింది. గుంతకల్లు మండలం ఎన్.వెంకటాంపల్లి శివారులో మెరుపుదాడులు నిర్వహించి, దాదాపు రూ.19 లక్షల నగదు స్వాధీనంతో పాటు 17 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం కసాపురం సమీపంలో మొబైల్ స్థావరంపై కసాపురం పోలీసుస్టేషన్ ఎస్‌ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిపిన దాడిలో రూ.1.70 లక్షల నగదుతోపాటు ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. గుత్తి మండలం జక్కలచెరువు, పూలకుంట, తొండపాడు గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడులు జరిపి రూ.2 లక్షల కు పైగా నగదు స్వాధీనంతో పాటు 30 మందికి పైగా పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న, సహకారం అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
పోలీసులను ఏమారుస్తారిలా..
ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలు
నియోజకవర్గమంతా పేకాట శిబిరాలు
మందు, విందు,సకల సౌకర్యాలు సైతం...
రోజూ రూ.లక్షల్లో సాగుతున్న జూదం
పేకాట నిర్వాహకులు పోలీసులను ఏమార్చేందుకు శిబిరాలను ఒక చోట నుంచి మరొక చోటుకు మార్చుకుంటూ పోతున్నారు. అలా గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో మొబైల్ పేకాట శిబిరాలుగా రూపాంతరం చెందాయి. ఎక్కడా రెండు రోజులకు మించి శిబిరం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే శిబిరాలు ఎక్కడ ఉంటాయో జూదరులకు ఎప్పటికప్పుడు నిర్వాహకులు సమాచారం చేరవేస్తూ వస్తున్నారు. అలా ఎవరైనా పోలీసులు నామ్‌కే వాస్తుగా దాడులు చేయాలనుకున్నా దొరక్కుండా తెలివిగా తప్పించుకుంటున్నారు.
ప్రశాంతంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం నేడు పేకాటకు కేరా


