జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణ
క్రీడా పోటీల్లో ఉద్రిక్తత
● తొలిరోజే రసాభాసగా అంతర్ కళాశాలల మహిళల క్రీడా పోటీలు
అనంతపురం సిటీ: అనంతపురం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం వేదికగా రెండ్రోజుల పాటు సాగే అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు తొలిరోజే (శుక్రవారం) ఉద్రిక్తతకు దారి తీశాయి. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వివాదానికి ప్రధాన కారణమైంది. వివరాల్లోకి వెళితే... ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల మధ్య తొలుత ఖోఖో పోటీ మొదలైంది. ఎస్కేయూ క్రీడాకారిణులు ఆడుతున్న సమయంలో అంపైర్లు ఫౌల్ ఇచ్చారు. ఆ సమయంలో వివాదం చెలరేగింది. అక్కడే ఉన్న ఏఐఎస్‌ఎఫ్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ఎస్కేయూ శాఖ నాయకులు జోక్యం చేసుకుని అంపైర్లను నిలదీశారు. స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ ఆర్ట్స్ కళాశాల జట్టుకు వత్తాసు పలికేలా మాట్లాడడంతో విద్యార్థి సంఘాల నేతలు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంతలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ సమాచారంతో మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే రాత్రి 7.30 గంటలకు చెస్ ఆడుతున్న సమయంలో మరోసారి రగడ మొదలైంది. తమను అనరాని మాటలు అన్నారంటూ పలువురు క్రీడాకారిణులు కన్నీళ్లు పెట్టుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరకు ఏడ్చుకుంటూనే అమ్మాయిలు ఇంటిదారి పట్టారు.


