‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు

Dec 20 2025 7:08 AM | Updated on Dec 20 2025 7:08 AM

‘పచ్చ

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు

ట్రాక్టర్లు ఎక్కడ..?

కంబదూరు మండలంలో మూడు పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను టీడీపీ నేతలు మాయం చేశారు. సర్పంచులను అడిగితే ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదని అంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ, ఈఓఆర్డీల దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం మంజూరు చేసిన కంపెనీ ట్రాక్టర్‌ కాకుండా వేరేది పంపారు. అసలు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్లు ఎక్కడ పోయాయో చూపాలి.

– హనుమంతరాయుడు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌, కంబదూరు

కళ్యాణదుర్గం: గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు పక్కదారిపట్టాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాటిని దర్జాగా వినియోగించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో చెత్తాచెదారం దిబ్బలుగా పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు 22 ట్రాక్టర్లు స్వచ్ఛభారత్‌ పథకం కింద మంజూరయ్యాయి. అందులో ఎనిమిది ట్రాక్టర్లు అధికార పార్టీ నేతలు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ట్రాక్టర్ల మాయంపై పంచాయతీల సర్పంచులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ట్రాక్టర్లను వ్యక్తిగతంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు ముఖ్య ప్రజాప్రతినిధి కూడా సొంత ఆస్తి అయినట్టు పంచాయతీ ట్రాక్టర్లను వాడుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ట్రాక్టర్లు లేక చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యం దెబ్బతింటున్నా తమ కేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్రాక్టర్లు పక్కదారి పట్టాయిలా..

కంబదూరు మండలంలోని కర్తనపర్తి, పాళ్లూరు, రాళ్ల అనంతపురం పంచాయతీలకు మూడు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అయితే ఆ ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో కనిపించడం లేదు. ట్రాక్టర్‌ గురించి రాళ్ల అనంతపురం సర్పంచ్‌ గతంలో అధికారులకు అర్జీ ఇచ్చారు. స్పందన లేకపోవడంతో మరోసారి అర్జీ ఇవ్వడంతో.. తన పంచాయతీకి కేటాయించిన ‘మహీంద్ర 275’ ట్రాక్టర్‌కు బదులుగా ఐషర్‌ కంపెనీ ట్రాక్టర్‌ను అధికారులు పంపారు. దీంతో సదరు సర్పంచు అనధికారిక ట్రాక్టర్‌ను వెనక్కిచేశ్చారు. మిగిలిన రెండు పంచాయతీల ట్రాక్టర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌సీ కంపెనీ పనులకు వినియోగిస్తున్నట్లు సర్పంచులు ఆరోపిస్తున్నారు.

● శెట్టూరు మండలంలో శెట్టూరు, కనుకూరు, లక్ష్మంపల్లి, ములకలేడు, బచ్చేహళ్ళి గ్రామాలకు కొత్త ట్రాక్టర్లు కేటాయించారు. అయితే శెట్టూరులో టీడీపీ సర్పంచ్‌ ఉరాల కుమార్‌ పంచాయతీ ట్రాక్టర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్నారు.

● బ్రహ్మసముద్రం మండలంలో బ్రహ్మసముద్రం, పిల్లలపల్లి, సంతే కొండాపురం, భైరవానితిప్ప, పాల వెంకటాపురం గ్రామాలకు మొత్తం ఐదు ట్రాక్టర్లను కేటాయించారు. ఇందులో పిల్లలపల్లిలో మాజీ ఎంపీపీ మంజుల భర్త వన్నూరుస్వామి, పాల వెంకటాపురంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు బంధువు, సంతే కొండాపురంలో సర్పంచ్‌ మల్లెల వనిత తమ సొంత పనులకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు.

● కళ్యాణదుర్గం మండలంలో మొత్తం నాలుగు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇందులో కొత్తూరు, పాలవాయి, ముద్దినాయనపల్లిలో గ్రామ పంచాయతీ పనులకు వినియోగించుకుంటుండగా.. గోళ్ల గ్రామ పంచాయితీలో టీడీపీ సర్పంచ్‌ తన సొంత పనులకు వాడుకుంటున్నారు.

● కుందుర్పి మండలంలో 5 ట్రాక్టర్లు మంజూయ్యాయి. ఎనుములదొడ్డి, జంబుగుంపల, మలయనూరు, కుందుర్పిలో పంచాయతీ అవసరాలకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. బెస్తరపల్లిలో మాత్రం టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం

స్వచ్ఛభారత్‌ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో ఉండాలి. ఎక్కడైనా సర్పంచులు లేదా ఇతరులు సొంత పనుల కోసం వాడుకున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. అలాంటి ట్రాక్టర్లను పంచాయతీల ఆధీనంలోకి తెస్తాం. పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను పంచాయతీ అవసరాలకే వాడుకోవాలి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వాడుతుంటే.. వాటిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– నాగేశ్వరరావు, డీఎల్‌డీఓ

పల్లెల్లో పేరుకుపోయిన చెత్తదిబ్బలు

ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టని వైనం

దర్జాగా సొంత పనులకు వినియోగిస్తున్న నేతలు

ట్రాక్టర్లు ఏమయ్యాయో కూడా పట్టించుకోని అధికారులు

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు 1
1/2

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు 2
2/2

‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement