అక్కడా ఓటేస్తాం.. ఇక్కడా ఓటేస్తాం
రాప్తాడు రూరల్: ఓటు హక్కు కల్గిన వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే నిబంధనలకు విరుద్ధం. చట్టరీత్యా నేరం కూడా. దీన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రెండు ఓట్లు ఉంటే వారికి ఇష్టమైన ప్రాంతంలో ఒకచోట ఓటు పెట్టుకుని, రెండోచోట ఉన్న ఓటును కచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారి ఓట్లు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొందరు ఫారం–7 దరఖాస్తు చేసుకున్నా.. తమకు అనుకూలమైన ఓట్లు తొలగిపోతాయంటూ నాయకులు ఒత్తిళ్లు చేస్తుండడంతో ఫారం–7 దరఖాస్తులను బోగస్ డిక్లరేషన్ (ఓటుదారుడికి తెలీకుండా) ఇచ్చి వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
డబుల్ ఓట్లపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో డబుల్ ఓట్లపై వైఎస్సార్‌సీపీ నాయకులు శుక్రవారం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్‌చార్జ్‌లు సనప గోపాల్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగమల్లేశ్వరరెడ్డి, పెరవళి జయచంద్రారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు యర్రగుంట సోమశేఖర్‌రెడ్డి, యువజన విభాగం గ్రామ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, బండమీదపల్లి నాయకులు రాప్తాడు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌ఓ) రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడును వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండమీదపల్లిలో 153, 154, 155, 156 బూత్‌లలో దాదాపు 145 మందికి పైగా డబుల్ ఓట్లుగా ఉన్న వాటిని తొలగించాలంటూ ఫారం–7 దరఖాస్తులు అందజేసినా.. అందులో 5 మాత్రమే తొలగించి, తక్కినవి కొనసాగిస్తున్నారన్నారు. అధికార టీడీపీకి చెందిన కొందరు నాయకులు నకిలీ డిక్లరేషన్లు ఇవ్వడం, వాటి ఆధారంగా ఆ ఓట్లను కొనసాగిస్తుండటం చేస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ ఓట్లను తొలగించకపోతే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
ఈ ఫొటో చూడండి. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన మనుబోలు గోపాల్‌చౌదరి కుటుంబం 30 ఏళ్లకు పైగా అనంతపురం నగరంలో స్థిరపడింది. ఈయన కుటుంబానికి నేటికీ స్వగ్రామంలో ఓట్లు ఉన్నాయి. మరోవైపు అనంతపురంలోనూ వీరికి ఓట్లు ఉన్నాయి. మనుబోలు గోపాల్‌చౌదరి ఎన్‌డీఎఫ్ 2315786 నంబరులో ఓటరుగా, ఈయన కుమారుడు మనుబోలు మధుసూదన్‌రావు ఎన్‌డీఎఫ్ 2315778 ఓటరుగా బండమీదపల్లి ఓటర్ల జాబితాలో ఉన్నారు. అనంతపురంలోనూ మనుబోలు గోపాల్‌చౌదరి (వైడబ్ల్యూబీ 1038678) ఓటరుగా, ఆయన కుమారుడు మధుసూదన్‌రావు (వైడబ్ల్యూబీ 3124021) ఓటరుగా ఉన్నారు. అంటే వీరు అటు అనంతపురం, ఇటు బండమీదపల్లిలో ఓట్లు వేస్తూ వస్తున్నారు. వీరే కాదు ఈ ఒక్క పంచాయతీ పరిధిలోనే దాదాపు 250కి పైగా డబుల్ ఓట్లున్నాయి.
ఫారం–7పై నామమాత్రంగా విచారణ
ఊరిలో లేకున్నా ఓటర్లుగా కొనసాగింపు
అధికారులపై ‘అధికార పార్టీ’ నేతల ఒత్తిళ్లు
రాప్తాడు మండలం బండమీదపల్లిలోనే వందలాదిగా డబుల్ ఓట్లు
అక్కడా ఓటేస్తాం.. ఇక్కడా ఓటేస్తాం


