ఇదేం ‘పచ్చ’పాతం!
● వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల తొలగింపు
● అధికారులు, టీడీపీ నేతల దాష్టీకం
అనంతపురం క్రైం: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం టీడీపీ నాయకులు, అధికారులు తొలగించి ‘పచ్చ’ పాతాన్ని చాటారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక రోజు ముందే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టవర్‌క్లాక్ వంతెనకు ఇరువైపులా, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి శనివారం ఉదయమే నగర పాలక సంస్థ సిబ్బంది పూనుకున్నారు. విషయం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఫ్లెక్సీలు తొలగించిన టౌన్‌ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. కళ్లముందే అధికార పార్టీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకోకుండా.. తమ అధినేత ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. అయితే.. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పడం చర్చనీయాంశమైంది.
6 గంటలకే ప్రజా ప్రతినిధికి
సమాచారం
నగరపాలక సంస్థలోని టౌన్‌ప్లానింగ్ ఉద్యోగి ఒకరు స్థానిక ప్రజా ప్రతినిధికి ఉదయం ఆరు గంటలకే వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల గురించి సమాచారం చేరవేశారు. దీంతో ఎలాగైనా ఫ్లెక్సీలను తొలగించాలని సదరు ప్రజాప్రతినిధి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ తొలగించేందుకు పూనుకున్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిని వైఎస్ జగన్ అభిమానులు, నాయకులు అడ్డుకుంటున్న దృశ్యాలను సైతం వీడియోలు తీసి సదరు ప్రజాప్రతినిధికి పంపినట్లు సమాచారం. శనివారం ఉదయం నగరపాలక సంస్థ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఫ్లెక్సీలను తొలగింపజేసీన అధికార పార్టీ నేతలు అంతటితో ఆగలేదు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతించారన్న విషయం తెలుసుకున్న టీడీపీకి చెందిన అల్లరి మూకలు రాత్రి 9.30 గంటలకు టవర్‌క్లాక్ ఫ్లై ఓవర్‌పై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఫ్లెక్సీలను తొలగించారు.అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరించటాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుబట్టారు.
వైఎస్ జగన్ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ జీపులో నుంచి తీసుకుంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురం రామ్‌నగర్ 80 ఫీట్ రోడ్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న
నగరపాలక సంస్థ సిబ్బందిని అడ్డుకుంటున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారు..
నగరంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహించినా.. ప్లెక్సీలు కట్టే సాంప్రదాయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో చూస్తేనే .. అధికార పార్టీకి వణుకుపుడుతోంది. ఈ నెల 15న అనంతపురంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ, 18న విజయవాడలో జరిగిన కోటి సంతకాల ప్రతుల భారీ ర్యాలీకి అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనెల 21న తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో నగరంలో ప్లెక్సీలు కట్టారు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఫ్లెక్సీలు తొలగించడం సరికాదు. ఫ్లెక్సీలు ఎవరు తొలగించారో.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి.
– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఇదేం ‘పచ్చ’పాతం!
ఇదేం ‘పచ్చ’పాతం!


