వ్యవ‘సాయం’.. రైతు సుభిక్షం
●వైఎస్ జగన్ హయాంలో పండుగలా వ్యవసాయం ●అన్నదాతలకు ప్రతి అడుగులోనూ తోడుగా..
అనంతపురం అగ్రికల్చర్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించిన 2019–2024 మధ్య కాలంలో అన్నదాత లోగిళ్లు సంక్షేమంతో వెల్లివిరిసాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌బీకే వ్యవస్థకు నాందిపలికారు. ఏటా క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం రైతుభరోసా–పీఎం కిసాన్, ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ అందించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాసిరకం, కల్తీ సరుకులను అరికట్టేందుకు వీలుగా రూ.కోట్లు వెచ్చించి ఆర్‌బీకేలు, అగ్రి, వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు మద్దతు ధరలు దక్కేలా చర్యలు చేపట్టారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అన్నదాతకు అండగా నిలబడ్డాడు. ఇలా వైఎస్ జగన్ హయాంలో వ్యవ‘సాయం’ రైతులకు సుభిక్షంగా మారింది.
ఐదేళ్లలో రూ.1,937 కోట్ల ‘భరోసా’
వైఎస్సార్‌సీపీ హయాంలో పీఎం కిసాన్‌తో కలిపి రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.13,500 ప్రకారం అందించారు. ఐదేళ్ల కాలంలో ఒక్కొక్కరికి రూ.67,500 ప్రకారం జిల్లాలో 2.90 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏకంగా రూ.1,937 కోట్ల మేర నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. రైతులపై ప్రీమియం భారం మోపకుండా ఐదేళ్లూ ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్ బీమా పథకాలు అమలు చేశారు. ఐదేళ్లలో 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,205 కోట్ల మేర పరిహారం ఇచ్చారు. అలాగే పంట నష్టానికి రూ.377 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ జమ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 280 మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి రూ.17.40 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. సున్నా వడ్డీ కింద 3.40 లక్షల మందికి రూ.72 కోట్లు అందించారు. మద్దతు ధర లేని సమయంలో ఎంఎస్‌పీ ద్వారా రూ.350 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఇక 1.70 లక్షల వరకు వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. 40 శాతం రాయితీతో యాంత్రీకరణ పరికరాలు, 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ ఇతరత్ర విత్తనాలు సకాలంలో పంపిణీ చేశారు. అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్‌పరికరాలు, ఉద్యాన రైతులకు ప్రోత్సాహక రాయితీలు, పాడి రైతులకు మంచి ధర లభించేలా అమూల్ పాలవెల్లువ అమలు చేశారు. ఇలా చెబుతూ పోతే 2019–24 మధ్య కాలంలో ప్రకృతి, పాలకులు సహకరించడంతో వ్యవసాయం సంక్షేమం దిశగా పయనం సాగించింది.


