దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

Dec 21 2025 9:12 AM | Updated on Dec 21 2025 9:12 AM

దైవదర

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

పామిడి: పామిడి 44వ నంబర్‌ జాతీయ రహదారిపై నీలూరుక్రాస్‌ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటచార్‌ (60), ఆయన భార్య గీతమ్మ (55) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ రవిప్రసాద్‌ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్ల్లాపూర్‌ నుంచి వెంకటేష్‌ ఆచారి, అతని భార్య, గీత, కుమారుడు విష్ణుభగవాన్‌, కోడలు అక్షితతో కలిసి ఇటియోస్‌ కారులో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి శుక్రవారం అర్ధరాత్రి బయల్దేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నీలూరు క్రాస్‌ వద్దకు రాగానే ఆగి ఉన్న వాహనాన్ని కారు వెనుకవైపు నుంచి ఢీకొనింది. ఈప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు వెంకటాచారి, ఆయన భార్య గీతమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోడలు అక్షిత (30), ముందు కూర్చున్న కుమారుడు విష్ణుభగవాన్‌ (32), డ్రైవర్‌ నరసింహమూర్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవిప్రసాద్‌, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి సీహెచ్‌సీకి తరలించారు. గాయపడిన ముగ్గురిని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణుభగవాన్‌, డ్రైవర్‌ నరసింహమూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ

పామిడి: పామిడిలోని 44వ నంబర్‌ జాతీయ రహదారిపై నీలూరు క్రాస్‌ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ జగదీష్‌ పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆయన ఎస్‌ఐ రవిప్రసాద్‌, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ముందు నిలిపి ఉన్న, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

శెట్టూరు: అనుంపల్లి సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు బైఠాయించి, శనివారం నిరసన తెలియజేశారు. అనుంపల్లి రైతులు మాట్లాడుతూ రెండు రోజులుగా త్రీపేస్‌ విద్యుత్‌ సరఫరా చేయలేదని, దీంతో నీరులేక పంట పొలాలు ఎండుముఖం పట్టాయన్నారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఓవర్‌ లోడ్‌తో నిత్యం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విద్యుత్‌ ఏఈ బాలచంద్ర రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా చూసుకుంటామని ఏఈ తెలిపారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించండి

అనంతపురం మెడికల్‌: నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని, ఆదివారం ప్రారంభమయ్యే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఓ ఆనంద్‌ పిలుపునిచ్చారు. శనివారం పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఈ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ జిల్లాలో 2,84,774 మంది చిన్నారులున్నారన్నారు. 31 మండలాల పరిధిలోని 51 పీహెచ్‌సీలు, 25 యూపీహెచ్‌సీలు, 6 పీపీ యూనిట్లు , 82 యూనిట్లలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఐఓ డాక్టర్‌ శశిభూషణ్‌ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, హెచ్‌ఈఈఓ త్యాగరాజు పాల్గొన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

అనంతపురం అర్బన్‌: ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని యువతకు కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ పిలుపునిచ్చారు. శనివారం జేఎన్‌టీయూలోని రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో ‘ పర్యావరణంలో అవకాశాలు’ ఇతివృత్తంతో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ సీఈఓ చంద్రమౌళి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్‌ యాదవ్‌, జెడ్పీ సీఈఓ శివశంకర్‌, డీపీఓ నాగరాజునాయుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్లు పాల్గొన్నారు.

చిట్టి చేతులు..అద్భుత ప్రయోగాలు

అనంతపురం సిటీ: అనంతపురం శివారు పంగల్‌ రోడ్డు సమీపంలోని రాప్తాడు ఏపీ మోడల్‌ స్కూల్‌లో శనివారం నిర్వహించిన విద్యా వైజ్ఞానిక జిల్లా స్థాయి ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్ల నుంచి మొత్తం 124 ప్రదర్శనలు వచ్చాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, డీఈఓ కడప ప్రసాద్‌బాబు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం ఏడు గ్రూప్‌ ప్రాజెక్టులు, రెండు ఉపాధ్యాయ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు తమ చిట్టి మెదళ్లకు పదునుపెట్టి, అద్భుత నమూనాలు తయారు చేశారు. పిల్లల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి.

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు 1
1/2

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు 2
2/2

దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement