నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టండి
కూడేరు: ‘తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులను అధికారులుగా మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతున్నారు’ అని సీఎం కార్యాలయ తరఫున వచ్చిన అధికారి పార్వతి, జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవిని రైతులు నిలదీశారు. ‘బ్యాడిగి మిరపకు తెగుళ్లు – నివారణ చర్యలు’ అంశంపై గురువారం కూడేరు మండలం ముద్దలాపురంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని వివిధ గ్రామా ల రైతులు హాజరయ్యారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తుండగా పలువురు రైతులు అడ్డుకుని నకిలీ విత్తనాలు, ఎరువులతో తామేలా నష్టపోతున్నది ఏకరవు పెట్టారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంధించడంతో సమాధానం చెప్పలేక అధికారులు తటపటాయించారు. చివరకు ఈ విషయంపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేస్తామని భరోసానిచ్చారు. అనంతరం మిరపలో ఆశించే తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీఈఓ యాస్మిన్, ఎంపీఈఓలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.


