పథకం పేరు మారిస్తే శ్రామికులకు ఒరిగేదేమీ?
● కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 22న కలెక్టరేట్ వద్ద ధర్నా
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
అనంతపురం అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చినంత మాత్రాన ఉపాధి కూలీల (శ్రామికులు)కు ఒరిగేది ఏమీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా తలపెట్టినట్లు తెలిపారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా నారాయణస్వామి హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ పథకంపై తీవ్రమైన దాడి మొదలైందన్నారు. ఇందులో భాగంగానే పథకానికి పేరుమార్చేందుకు ది వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్‌ను ప్రవేశపెట్టారన్నారు. అయితే పేరు మార్పు కాదని, ఉపాధి కూలీల జీవితాల్లో వికసిత్ ఉండాలనే విషయాన్ని ప్రధాని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు, పనిదినాలు పెంపు సవ్యంగా ఉండాలన్నారు. సగటు వేతనం రోజుకు రూ.240కు తగ్గించడం సబబు కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కూలీల పాలిట శరాఘాతమే అవుతుందన్నారు. పథకానికి సంబంధించి కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం ప్రతిపాదించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కాబట్టి పథకాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, దేవేంద్ర, సంగప్ప, తదితరులు పాల్గొన్నారు.


