అధ్యక్షా! మైదానాల్లేవ్.. మొక్కలు ఎక్కడ నాటాలి?
కళ్యాణదుర్గం రూరల్: ‘అధ్యక్షా! కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో మైదానాల్లేవ్.. ఇక మొక్కలు ఎక్కడ నాటాలి?’ అంటూ విద్యాశాఖ మంత్రిపై ప్రతిపక్ష సభ్యురాలు తలారి అభిజ్ఞ ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలోనూ ప్రతి విద్యార్థీ ఓ మొక్కను నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు జీఓ పాస్ చేయాలని కోరారు. ఈ అంశాన్ని మాక్ అసెంబ్లీలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రమేష్, చంద్రకళ దంపతుల కుమార్తె అభిజ్ఞ ఆక్షేపించారు. ‘ప్రతి విద్యార్థి మొక్క నాటాలని జీఓ జారీ చేయాలనడం సబబుగానే ఉన్నా... మా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విరామ సమయంలో క్రీడలు ఆడుకునేందుకు మైదానాలూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు ఎక్కడ నాటాలో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి’. ముందుగా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరిస్తే... ఆ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి. ఆ దిశగా ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని చురకలు అంటించేలా మాట్లాడారు.
మాక్ అసెంబ్లీ సమావేశంలో దుర్గం నియోజకవర్గ విద్యార్థిని ఆసక్తికర ప్రశ్న


