ఉన్నత స్థాయికి ఎదగాలి
అనంతపురం అర్బన్: కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా శాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులను బుధవారం కలెక్టర్ తన చాంబర్‌లో అభినందిస్తూ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాదరావు, ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు.
పతాక దినోత్సవం నిధికి విరాళాలివ్వండి
సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీకాన్ఫరెన్స్ హాల్‌లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయుధ దళాల ఫ్లాగ్‌డే సంక్షేమ నిధికి సంబంధించిన కార్ ఫ్లాగ్, స్టిక్కర్లను అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప మాట్లాడుతూ.. విరాళాలు ఇవ్వదలిచిన వారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అనంతపురం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబరు 6207 695 6433, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ BIN0021438 కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎ.మలోల, బీసీ సంక్షేమాధికారి కుష్బూకొఠారి, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య పాల్గొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికై న గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులు నెలరోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 84 పనులు ఆమోదించగా పెండింగ్‌లో ఉన్న 24 పనులను నెలలో పూర్తి చేసి బిల్లులను జిల్లా పరిషత్‌కు పంపించాలన్నారు. రెండవ దశలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కణేకల్లు మండలం గరుడచేడు పంచాయతీ మీనహళ్లి, పెద్దవడుగూరు మండలం పెనకలపాడు పంచాయతీ కోడూరు ఎంపికయ్యాయన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
శిథిలావస్థ గదుల్లో బోధన వద్దు
పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. వాటి మరమ్మతుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి (ఆర్‌ఓ) ప్లాంట్లు పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలు కచ్చితంగా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులకు కలెక్టర్ ఆనంద్ సూచన


