‘సాయం’ అందేది ఎన్నడు?
రాయదుర్గం: రైతు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించక జిల్లాలోని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6 వేలు ప్రయోజనం చేకూరేలా.. మూడు విడుతలుగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలు నమోదుకు 2019, జనవరి 31నాటికి తుది గడువును విధించారు. దీంతో జిల్లాలోని 31 మండలాల్లో 4.20 లక్షల మంది రైతులు ఉండగా దరఖాస్తు చేసుకున్న వారిలో 2,75,642 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. మిగిలిన వారు అప్పటి నుంచి నేటి వరకూ పథకం లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు.
విశిష్ట సంఖ్య వచ్చినా నిరాశే..
కేంద్ర ప్రభుత్వ పథకం ఏదీ పొందాలన్నా విశిష్ట గుర్తింపు కార్డు ఉండేలా కార్యచరణ చేపట్టారు. ఈ మేరకు ప్రతి రైతుకు ఆధార్ తరహా 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయించారు. పోటీపడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విశిష్ట సంఖ్య పొందితే కిసాన్ సమ్మాన్ పథకం తప్పక వర్తిస్తుందని ఆశపడ్డారు. కానీ నిరాశే ఎదురైంది. దీనికి తోడు పెట్టుబడి సాయం అందించడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు విధించాయి. అర్హత జాబితా నుంచి చాలా మందిని తొలగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీఎం కిసాన్– రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా 2.94 లక్షల మందికి రూ.200.20 కోట్లకు పైగా సాయం అందింది. కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా నాన్చుడు దోరణి అవలంభిస్తూ వచ్చింది. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడంతో కొత్త లబ్ధిదారుల ఎంపిక కాస్త అటకెక్కింది.
పీఎం కిసాన్ నమ్మాన్ నిధి కోసం రైతుల ఎదురుచూపు
2019 జనవరి 31 తర్వాత ఆగిన లబ్ధిదారుల ఎంపిక
పట్టించుకోని చంద్రబాబు సర్కార్
జిల్లాలో మొత్తం రైతులు ః 4.20
లక్షల మంది
పీఎం కిసాన్
లబ్ధిదారులుః 2,75,642
మంది


