సోషలిజం వైపు అందరి చూపు
● సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు
అనంతపురం అర్బన్: పెట్టుబడిదారీ విధానాల దుర్లక్ష్యాలతో యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో పడుతోందని, ఇలాంటి తరుణంలో దేశాలన్నీ సోషలిజం వైపు దృష్టి సారించాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ‘సోషలిజం విశిష్టత– సామ్రాజ్యవాద వైఫల్యం’ అంశంపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. అంతకు ముందు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లలిత కళాపరిషత్ వరకు రెడ్ కవాతు నిర్వహించారు. సదస్సులో బీవీ రాఘవులుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా మరింత జఠిలం చేసిందన్నారు. భారత దేశంలో ఈ విధానం వల్ల ఒక్క శాతంగా ఉన్న ధనికుల వద్ద 51 శాతం దేశ సంపద కేంద్రీకృతమైందన్నారు. ఒక వైపు సంపన్నులు సంపద పెంచుకుంటూ ఉంటే మరో వైపు పేదరికం పెరిగిపోతోందన్నారు. 129 దేశాల ఆకలి సూచికలో మన దేశం 124వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలందరికీ ఆక్షరాస్యత, సొంత ఇల్లు, వైద్యం వంటి కనీస సదుపాయాలను ప్రభుత్వాలు అందించలేకపోయాయని విమర్శించారు. 1917లో రష్యాలో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వం అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న బ్రిటన్, అమెరికాకు దీటుగా పలు విజయాలను సాధించిందన్నారు. అలాంటి వ్యవస్థ కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. అమెరికాలోనే పలు నగరాలకు మేయర్‌లుగా సోషలిస్టు నాయకులు ఎన్నికకావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విఫలమైందని రాంభూపాల్ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందన్నారు. 12 గంటల పని విధానం అమలు దుర్మార్గమన్నారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా నాయకులు నాగేంద్రకుమార్, బాలరంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డీనాయుడు, ముత్తుజా, రామిరెడ్డి, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


