వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తే సహించబోమని ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాల్లో అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు పార్టీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతితో కలసి బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కలిసి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను చంపేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నట్లు ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికలుగా కొందరు టీడీపీ నాయకులు దుష్ప్రచారం సాగిస్తున్నారన్నారు. అసత్య, నిరాధరమైన వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ తరహా కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు వీడియో మూలాలను డిజిటల్ ఫొరెన్సిక్ విశ్లేషణ ద్వారా గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాజేష్‌రెడ్డి, అనిల్‌కుమార్‌గౌడ్, మహేష్‌గౌడ్, హనుమంతరెడ్డి, రషీద్‌ఖాన్, శ్రీనివాసులు, లీగల్‌సెల్ నాయకులు గౌని నాగన్న, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నాగరాజుబాబు, నారప్పరెడ్డి, పద్మావతి, కవితారెడ్డి, జ్యోతి, రేవతి తదితరులు పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో విష ప్రచారాలు బాధాకరం
కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్


