సైన్స్ సెంటర్‌లో నేటి నుంచి శిక్షణ
అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ల్యాబ్ ఇన్‌చార్జ్ ఉపాధ్యాయులకు బుధవారం నుంచి అనంతపురంలోని సైన్స్ సెంటర్‌లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అటల్ టింకరింగ్‌కు సంబంధించి ల్యాబ్ నిర్వహణ, నిధుల వినియోగం, ప్రాజెక్టుల తయారీ, రికార్డుల నిర్వహణ వంటి అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.
పాముకాటుతో యువరైతు మృతి
పుట్లూరు: మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన యువరైతు యలగాని ప్రతాప్ (30) పాముకాటుతో మృతిచెందాడు. గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలానికి నీరు పెట్టడానికి మంగళవారం ఉదయం వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య శరణ్య, ఐదు నెలల కుమార్తె ఉంది. కాగా, భర్త మృతిపై శరణ్య అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత బలవన్మరణం
పెద్దపప్పూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన అనిత (30)కు ఎనిమిదేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మంగల శ్రీరాములుతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోడంతో అనిత పుట్టింటికి చేరుకుంది. ఆ సమయంలో పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన అనిత.. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల ఏడుపులను విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడడంతో విషయం వెలుగు చూసింది. కాగా, అప్పటికే భర్త, అత్తమామలు పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మంగళవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం త్రీటౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన రహమత్, ఆరో రోడ్డులో నివాసముంటున్న అస్లాంబాషా, 3వ రోడ్డుకు చెందిన రవికుమార్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన సాలోమన్, తపోవనంలో నివాసముంటున్న జ్యోతుల ప్రవీణ్‌కుమార్, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతానికి చెందిన దినేష్‌గౌడ్, బెళుగుప్పకు చెందిన మనోజ్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల గంజాయి, 8 సెల్‌ఫోన్లు, రూ. 2,700 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురుగుంటకు చెందిన హాజీ రహమత్ అలియాస్ బువమ్మతో కలసి మనోజ్‌కుమార్, షేక్ అస్లాంబాషా ఇటీవల విశాఖపట్నం జిల్లా తునికి వెళ్లి అక్కడ ఓ వ్యక్తి నుంచి కిలో రూ. 5వేలు చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా రైలులో అనంతపురానికి తీసుకువచ్చారు. ఇందులో నాలుగు కిలోల గంజాయిని కర్ణాటకలోని బాగేపల్లిలో విక్రయించారు. 100 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి నగర పరిసరాల్లో ప్యాకెట్ రూ.2 వేలు చొప్పున విక్రయించేందుకు చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు.
సైన్స్ సెంటర్‌లో నేటి నుంచి శిక్షణ


