రైతులను తక్షణమే ఆదుకోవాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి
ఉరవకొండ: పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొక్కజొన్న, మినుములు, శనగలు, పత్తి, అరటి, మిర్చితో పాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం అందకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతోందన్నారు. పంటకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ 18 నెలల కాలంలోనే వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. ఇదే అవకాశంగా భావించిన దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1,400కు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పెట్టుబడుల సేకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విదేశీ పర్యటనలు సాగిస్తున్నారని విమర్శించారు. యోగా డే పేరుతో రూ.300 కోట్లను వృథాగా ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటికై నా రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
బాల్య వివాహాలు లేని జిల్లాగా మారుద్దాం
● జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్‌రాబు
రాప్తాడు రూరల్: బాల్య వివాహాలు లేని జిల్లాగా అనంతను మారుద్దామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీసీఎల్‌ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి రాజశేఖర్‌బాబు పిలుపునిచ్చారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట కేజీబీవీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘బాల్య వివాహాలు అరికట్టడం’ అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే ఆడ పిల్లలకు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఉన్నతస్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా బాగా చదువుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ అరుణకుమారి మాట్లాడుతూ.. బాలల రక్షణ చట్టాలపై చైతన్య పరిచేలా జిల్లాలోని 32 కేజీబీవీల్లో 16 రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగుతాయన్నారు. లోక్ అదాలత్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో చైతన్యం తెస్తాయన్నారు. అనంతరం విద్యార్థినులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, చైల్డ్‌హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్మద, లీగల్ ఆఫీసర్ సంధ్యారాణి, రెడ్స్ ఎన్జీఓ సీఈఓ భానూజ పాల్గొన్నారు.
రైతులను తక్షణమే ఆదుకోవాలి


