అజ్ఞాతంలోకి చిట్టీ నిర్వాహకురాలు
● లబోదిబోమంటున్న బాధితులు
గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న చిట్టీ నిర్వాహకురాలు దిల్‌షాద్ తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. చిట్టీ కట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఆదివారం ఆమె ఇంటి ఎదుట బాధితులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ ఎవరూ ఏమీ చేయలేరంటూ దిల్‌షాద్ బెదిరింపులకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బాధితులు వినలేదు. దాదాపు ఐదు గంటలకు పైగా దిల్‌షాద్ ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు తన ఇంటిని విక్రయించి డబ్బు చెల్లిస్తానంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్న దిల్‌షాద్ సోమవారం రాత్రికి రాత్రే తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు అరుణమ్మ, చాంద్‌బీ, షాకీరా, మంజుల, శ్రీమేఘన, పర్వీన్, రాబర్ట్, రాబియా తదితరులు మంగళవారం మరోసారి దిల్‌షాద్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయజ్యోతి, కేజీఎన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ సాహెబ్, కాంగ్రెస్ నాయకులు మహేంద్ర, ఫిరోజ్‌ఖాన్ తదితరులు మద్దతు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ రోజూ దిల్‌షాద్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.


