ఎస్‌ఆర్‌ఐటీకి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలకరు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని ఆ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఐటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో 5 బీటెక్ కోర్సులకు టైర్–1 కింద నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) గుర్తింపు దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో రాయలసీమ జిల్లాల్లోనే నంబర్–1 స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాలగా ఖ్యాతి దక్కిందన్నారు. 2017లో న్యాక్ ఏ–గ్రేడ్, 2018లో మూడు బీటెక్ కోర్సులకు (ఎన్‌బీఏ) టైర్–2 గుర్తింపు, 2019లో స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా లభించిందని గుర్తు చేశారు. తాజాగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), సివిల్ ఇంజినీరింగ్ (సీఐవీ), మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈసీ) కోర్సులకు (ఎన్‌బీఏ) టైర్–1 గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.


