రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని యర్రగుంట్ల వీఆర్‌ఏ వెంకటరాముడు (51) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. వెంకటరాముడు గత కొన్నేళ్లుగా యర్రగుంట్ల వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మర్తాడు క్రాస్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గార్లదిన్నె పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే వెంకటరాముడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నట్లు తెలిసింది.


