ఆశావాద దృక్పథంతో పనిచేయాలి
● అధికారులకు ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరక్టర్ శ్రీరామ్ తరణికంటి ఆదేశం
అనంతపురం అర్బన్: వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆశావాద దృక్పథంతో పనిచేయాలని జిల్లా అధికారులకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో కలెక్టర్ ఓ.ఆనంద్, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలసి జిల్లా అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న జిల్లా అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఐఏఎస్ అధికారులకు ఇచ్చే శిక్షణలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. సమస్య ఏదైనా ప్రాక్టికల్‌గా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న జిల్లా అధికారులకు సృజనాత్మకత జోడించేందుకు ముస్సోరీలో శిక్షణ ఇస్తే ప్రయోజనకంగా ఉంటుందని డీఆర్‌ఓ కోరగా.. అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు
క్రీడాకారుల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం సోమవారం జట్టును ప్రకటించింది. ఎంపికై న వారిలో మోక్షన తేజ్(కళ్యాణదుర్గం), హేమచంద్రా నాయక్ (అనంతపురం), పంకజ్ (గుత్తి), కె.రోహిత్ (హిందూపురం) కీలక జట్టులో చోటు దక్కించుకోగా, క్రిటిక్ సాయి (పరిగి) స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు.
వ్యక్తి బలవన్మరణం
అనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని పీటీసీ ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 45 సంవత్సరాలున్న వ్యక్తి గుంతకల్లుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌లో జనరల్ టికెట్ తీసుకున్నాడు. అంతకు మించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని సీఐ రాజేంద్రనాథయాదవ్ కోరారు.
యువతి ఆత్మహత్య
గుంతకల్లు: స్థానిక ధర్మవరం రైల్వే ఎల్‌సీ గేట్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని హనుమేష్ నగర్‌కు చెందిన వీరన్న, సుంకమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, వీరిలో చిన్న కుమార్తె లక్ష్మి (20) మానసిక సమస్యతో బాధపడుతోంది. దీంతో తరచూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన లక్ష్మి... ఉదయం 11.30 గంటల సమయంలో ధర్మవరం గేట్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. మొండెం నుంచి తల వేరుపడింది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
జాతీయ స్థాయి
కబడ్డీ పోటీలకు ఎంపిక
తాడిపత్రి టౌన్: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో తాడిపత్రికి చెందిన అయేషా ఎంపికై ంది. ఈ మేరకు కోచ్ నరసింహ సోమవారం వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మచిలీపట్నంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లుగా వివరించారు.
జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక
గుంతకల్లు రూరల్: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో డిసెంబర్ 11 నుంచి జరిగే జాతీయ స్థాయి పరుగు పోటీలకు గుంతకల్లు మండలం నరసాపురం జెడ్పీహెచ్‌ఎస్ పదో తరగతి విద్యార్థిని వర్షిత ఎంపికై ంది. అండర్–17 విభాగంలో ఎంపికై న వర్షితను ఆ పాఠశాల హెచ్‌ఎం మరియమ్మ, పీడీ చల్లా ఓబులేసు, ఇతర ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.
నేటి నుంచి
విద్యాశాఖ అధికారుల బడిబాట
అనంతపురం సిటీ: జిల్లాలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించేందుకు మంగళవారం నుంచి విద్యాశాఖ అధికారులు బడిబాట పట్టనున్నారు. ఇటీవల నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో కమిషనరేట్ జారీ చేసిన ఆదేశాల మేరకు రూట్‌మ్యాప్‌ను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. బోధనాంశాలు, పాఠశాలల ప్రగతి, విద్యార్థుల పురోగతి, గడువులోపు సిలబస్ పూర్తి చేయడం, పదో తరగతి పరీక్షల నిర్వహణ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల జారీ, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలన, మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేసి పాఠశాల కమిషనరేట్‌కు పంపనున్నారు. అలాగే విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల పని తీరును మదింపు చేయాలని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆశావాద దృక్పథంతో పనిచేయాలి
ఆశావాద దృక్పథంతో పనిచేయాలి
ఆశావాద దృక్పథంతో పనిచేయాలి


