అన్నదాత ఆక్రందనలు పట్టవా?
అనంతపురం: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. ఆయన సోమవారం అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఒక్క క్వింటాలు ధాన్యాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి తోటలను పంట ఉండగానే ట్రాక్టర్లతో దున్నేస్తున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. అరటి కిలో ఒక్క రూపాయికి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదన్నారు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, వరి ధాన్యం ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతన్నలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు పంచ సూత్రాలు వల్లె వేయడం శోచనీయమన్నారు. శాసీ్త్రయ వ్యవసాయం అంటూనే 99 పైసలకే కారు చౌకగా భూములను కార్పొరేట్‌కు కట్టబెడుతున్నారని విమర్శించారు. యూరియా బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ఉచిత విద్యుత్ పథకంతో రైతన్నలకు వెలుగు వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనూ అన్నదాతలకు తోడుగా నిలిచారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధి, ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా పథకాల ద్వారా అన్నదాతలకు దన్నుగా నిలిచారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏమీ లేవన్నారు. దాదాపు రూ.600 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాల్సి ఉన్నా..పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనని చంద్రబాబుకు తెలుసని, రైతులను ఆదుకునే మనసు లేదని విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో చంద్రబాబు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజూ ప్రత్యేక విమానాల్లో లగ్జరీగా తిరుగుతున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతన్నలకు తోడుగా వైఎస్సార్‌సీపీ నిలుస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అరటి, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు.
నేడు కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు
శింగనమల: నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను మంగళవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వివరించనున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక అరటి, మొక్కజొన్న, తదితర పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్‌ను కలుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు హాజరుకావాలని కోరారు.
చంద్రబాబు రైతు వ్యతిరేకి
గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు
విలేకరులతో మాజీ మంత్రి
సాకే శైలజానాథ్


