5, 12న షీప్ సొసైటీల ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ) ఎన్నికల నిర్వహణకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో షీప్ డెవలప్‌మెంట్ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ 350 సొసైటీలు రిజిష్టర్ చేసుకోగా... ఇందులో డిపార్ట్‌మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా, పెండింగ్‌లో ఉన్న అనంతపురం జిల్లాలో 39 సొసైటీలకు, సత్యసాయి జిల్లాలో 45 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిర్వహించడం లేదు. ఎన్‌సీడీసీ కింద రుణాలు తీసుకుని డిఫాల్టర్లుగా మారిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని అధికారులు పేర్కొన్నారు.
మహిళా దొంగకు దేహశుద్ధి
● మరో ఇద్దరి పరారీ
గుత్తి: స్థానిక స్పందన శారీ సెంటర్‌లో సోమవారం ముగ్గురు మహిళా దొంగలు చీరలు అపహరిస్తూ నిర్వాహకులు శ్రీనివాసులు, అభి, సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. పట్టుబడిన ఓ మహిళను అక్కడున్న మహిళలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. రూ. 20 వేలు విలువైన చీరలను కట్టెల బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, లోతైన విచారణ చేపట్టారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ‘సంకల్ప్’
● ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్‌లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సోమవారం నుంచి సంకల్ప్ కార్యక్రమం ప్రారంభమైందని ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యాచరణ 2026 ఫిబ్రవరి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో అభ్యసనా లోపాలను గుర్తించి, వారిపై వ్యక్తిగత శ్రద్ధ వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అలాగే సంకల్ప్ షెడ్యూల్ సక్రమంగా అమలయ్యే అంశంపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. డీవీఈఓలు వారానికి మూడు కళాశాలలు, ప్రాంతీయ సంచాలకుడు వారానికి రెండు కళాశాలలు సందర్శించి, సంకల్ప్ షెడ్యూల్‌పై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రత్యేక రివిజన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ఫలితాలకు ప్రిన్సిపాళ్లు, కేర్ టేకర్లు, సబ్జెక్టు అధ్యాపకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
5, 12న షీప్ సొసైటీల ఎన్నికలు


