కుప్పకూలిన ఒడిశా
● 124 పరుగులకు ఆలౌట్
● రాణించిన లోహిత్, కార్తీక్ రెడ్డి
● అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర బౌలర్లు లోహిత్, కార్తీక్ రెడ్డి విజృంభించడంతో ఒడిశా జట్టు 124 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టుకు 158 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానంలో కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 మ్యాచ్‌లో రెండో రోజు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ 246/7తో ప్రారంభించి 282 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఏఎన్‌వీ లోహిత్ 71 పరుగులు చేశాడు.
తడబడిన ఓడిశా..
అనంతరం బరిలో దిగిన ఒడిశా జట్టు ఆరంభం నుంచే తడబడింది. 63.1 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆంధ్ర బౌలర్లు ఏఎన్‌వీ లోహిత్ 37/4, కార్తీక్ రెడ్డి 47/4తో ఒడిశాను కట్టడి చేశారు. ఓడిశా జట్టులో సుభాసిస్ మల్లిక్ 40, ప్రశాంత్ మోక్షిత్ 35 పరుగులు చేశారు. అనంతరం ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.


