చిట్టీల పేరుతో మోసం
గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న దిల్‌షాద్ అనే మహిళ చిట్టీల వ్యాపారంతో తమను మోసం చేసిందంటూ పలువురు బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ బైఠాయించారు. ఇలాహి ఫొటో స్టూడియోతో పాటు కొన్నేళ్లుగా చిట్టీలను దిల్‌షాద్ నిర్వహిస్తోంది. ఆమె వద్ద అరుణమ్మ, మేఘన, పర్వీన్, అలీమా, షాహీన్, చాంద్‌బీ, రాబర్ట్, మంజుల, రాబియా, వెంకటరాముడు తదితరులు చిట్టీలు కట్టారు. గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు నేరుగా కలిసి ఆరా తీశారు. ఆ సమయంలో దిల్‌షాద్ ఎదురు బెదిరింపులకు దిగింది. ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ చేయలేరంటూ హెచ్చరికలు జారీ చేసింది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం చిట్టీలు వేసి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా బాధితులు వినలేదు. దాదాపు ఐదారు గంటలపాటు అక్కడే భీష్మించారు. ఆందోళనకు ఎమ్మార్పీఎస్ నాయకురాలు విజయజ్యోతి, తదితరులు మద్దతు పలికారు. చిట్టీలు కట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని ఎస్పీని కోరుతూ దిల్‌షాద్ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది.
నిర్వాహకురాలి ఇంటి ఎదుట బాధితుల ధర్నా


