మాతృ వందనం నమోదుకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మాతృ వందనం నమోదుకు కష్టాలు

Nov 23 2025 5:43 AM | Updated on Nov 23 2025 5:43 AM

మాతృ

మాతృ వందనం నమోదుకు కష్టాలు

తాడిపత్రి రూరల్‌: జిల్లాలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్‌తో పాటు సెల్‌ఫోన్లలో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాతి శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. జిల్లాలో నేటి వరకూ కేవలం 4,725 మంది లబ్ధిదారులను మాత్రమే ఎన్‌రోల్‌మెంట్‌ చేశారు. నమోదుకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్‌వాడీ టీచర్లు తల పట్టుకుంటున్నారు.

మొదటికాన్పుకు రూ.5 వేలు...

మాతృవందనం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో, జన్మనిచ్చిన తరువాత పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేలు జమచేస్తారు. అందులో భాగంగానే గర్భిణిగా నమోదు చేసుకున్న సమయంలో రూ.1000, బిడ్ట జన్మించినప్పుడు రూ.2 వేలు, బిడ్డకు టీకాలు వేయించే సమయంలో మరో రూ.2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6 వేలు జమచేస్తారు.

అరకొరగానే నమోదు

మాతృ వందనం పథకం అమలు కోసం ఐసీడీఎస్‌ ప్రాజెక్టులోని కొందరు సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరు అంగన్‌వాడీ టీచర్లకు కొంత మేరకు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్‌వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లల్లో యాప్‌లు వేసుకొని మాతృ వందనం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా సైతం వివరాల నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్‌తో పాటు సెల్‌ఫోన్లల్లోని సాంకేతిక కారణాలతో అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ సెంటర్లల్లోని రొటిన్‌ కార్యక్రమాలను పక్కనబెట్టి సెల్‌ఫోన్లతో కుస్తీ పడుతున్నా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు అరకొరగానే జరుగుతోంది.

అంగన్‌వాడీలపై ఒత్తిడి

మాతృ వందనం పథకం నమోదులో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక అంగన్‌వాడీ టీచర్లను గ్రూపులుగా చేసి ఒక సెంటర్‌కు రప్పించి వారిచేత సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో నమోదు పక్రియ చేస్తున్నారు. సెల్‌ఫోన్ల స్థానంలో ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు ప్రక్రియ చేయిస్తున్నారు.

లబ్ధిదారుల ఎదురుచూపు

జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ నుంచి వైద్యశాఖ నుంచి సమగ్ర శిశు సంక్షేమశాఖకు బదలాయించింది. ఇప్పటికే పలు యాప్‌లతో పనిభారం పెరిగి పలు ఇబ్బందులు పడుతున్నామని, నూతన బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. సక్రమంగా పనిచేయని సెల్‌ఫోన్లతో ఉన్న యాప్‌లకు తోడు మాతృ వందన యోజన పథకం కింద అదనంగా వచ్చిన యాప్‌తో ఎలా వివరాలు నమోదు చేయాలని అంగన్‌వాడీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పాత సెల్‌ఫోన్ల స్థానంలో కొత్తవాటిని పంపిణీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో అంగన్‌వాడీ టీచర్లు మూకుమ్మడిగా సెల్‌ఫోన్లను సీడీపీఓలకు అందజేశారు. కొత్త సెల్‌ఫోన్లను త్వరలో ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి తమపై ఒత్తిడి తెచ్చి మరి ఇచ్చిన సెల్‌ఫోన్లను తిరిగి తీసుకునేటట్టు చేశారని, నాలుగు నెలలు కావస్తున్నా కొత్తసెల్‌ఫోన్లను ఇవ్వకుండా డొక్కు సెల్‌ఫోన్లతో పనిచేయాలని ఒత్తిడులు తెస్తున్నారని వాపోతున్నారు.

తాడిపత్రి ఫస్ట్‌ .. కణేకల్లు లాస్ట్‌

జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో పీఎంఎంవీవై పథకం కింద శనివారం వరకు మొత్తం 4,725 మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే నమోదు చేశారు. అందులో తాడిపత్రి ప్రాజెక్టు 1855తో మొదటిగా ఉండగా కణేకల్లు ప్రాజెక్టు కేవలం 110 లబ్ధిదారుల ఎన్‌రోమెంట్‌తో చివరి స్థానంలో ఉంది.

సక్రమంగా పనిచేయని సెల్‌ఫోన్లు

ఇబ్బందులు పడుతున్న

అంగన్‌వాడీ టీచర్లు

జిల్లాలో నేటికీ కేవలం 4,725 మంది మాత్రమే నమోదు

ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

మాతృ వందనం నమోదుకు కష్టాలు 1
1/1

మాతృ వందనం నమోదుకు కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement