పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు
● డీఈఓ ప్రసాద్ బాబు ఆవేదన
అనంతపురం సిటీ: ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు. చదవలేకపోతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేసి పిల్లలందరూ చదివేలా.. రాసేలా శిక్షణ ఇవ్వండి. అంతకంటే ముందు పిల్లల్లో క్రమశిక్షణ, చిన్న పెద్ద గౌరవం లేకుండాపోతోంది. ఉపాధ్యాయులపై తిరగబడే పరిస్థితి వస్తోంది. వారికి నైతిక విలువల గురించి నేర్పించండి ’ అని జిల్లా విద్యాశాఖాధికారి కడప ప్రసాద్‌బాబు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురం బుడ్డప్పనగర్‌లోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ స్కూల్‌లో శనివారం అర్బన్, రూరల్ పరిధిలోని 11 కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. కాంప్లెక్స్ సమావేశాలను డీఈఓ పరిశీలించారు. పిల్లల్లో నేరప్రవృత్తి పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారభంగా కాకుండా క్రమశిక్షణ, విలువలతో పెంచాలని సూచించారు. ఏపీఓ మంజునాథ, పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఆర్‌యూపీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పది ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం
అనంతపురం సిటీ: గతంలో పదో తరగతి ఫెయిల్ అయి తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక అర్ధంతరంగా చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశం కల్పించినట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిలైన సబ్జెక్టులు రాసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తాము చదివిన పాఠశాలలోగాని, ఆంధ్రప్రదేశ్ విద్యాపీఠం వెబ్‌సైట్ www.apopenschool.ap.gov.in లో నేరుగా జిల్లా పేరు, స్కూల్ పేరు సెలక్ట్ చేసి అడ్మిషన్ పొందవచ్చన్నారు. అందుకు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రసవత్తరంగా బాస్కెట్‌బాల్ పోటీలు
నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల విభాగంలో వైజాగ్ జట్టు అనంతపురంపై గెలుపొందింది. బాలుర విభాగంలో అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8తో విజయం సాధించింది. అలాగే మరోమ్యాచ్‌లో అనంతపురం జట్టు విజయనగరంపై 29–0 గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్‌లో గుంటూరు జట్టు అనంతపురంపై 35–17 తేడాతో విజయం సాధించింది. కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్‌కు చేరాయి.
ఇళ్లు పరిశీలించాకే విద్యుత్ కనెక్షన్
అనంతపురం టౌన్: విద్యుత్ కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునే వినియోగదారుల ఇళ్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ ఒక ప్రకటనలో సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా చాల మంది విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా తక్కువ కాంట్రాక్టు లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తే భవిష్యత్‌లో వినియోగదారులు మరో మారు కాంట్రాక్టు లోడ్‌కు అదనంగా చెల్లించే పరిస్థితి వస్తుందన్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధించిన లైన్‌మెన్‌లు వినియోగదారుని ఇంటిని పరిశీలించి డబుల్, సింగల్ బెడ్‌రూం, డూప్‌లెక్స్ ఇళ్లా అని పరిశీలించి ఏమేర విద్యుత్ వినియోగం ఉంటుందో అంచనా వేసి ఎన్ని కిలోవాట్లు విద్యుత్ అవసరం ఉంటుందో ఆమేరకు డిపాజిట్ కట్టించాలన్నారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ కనెక్షన్లు తక్కువ కాంట్రాక్టు లోడ్‌తో మంజూరు చేస్తే విద్యుత్ సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై విద్యుత్ ఏఈలు సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు.
29న క్రికెట్ సంఘం ఎన్నికలు
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం క్రికెట్ సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆ సంఘం కార్యదర్శి భీమలింగారెడ్డి ఓ ప్రకటనలో విడుదల చేశారు. క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారిలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల స్క్రూట్నీ, అదే రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల జాబితా విడుదల, 26న ఉదయం 10 గంటల నుంచి 4 గంటలలోపు విత్ డ్రా, 26న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల బరిలో దిగే వారి జాబితా విడుదల, 29న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.
పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు


