సుబ్బరాయసాగర్ షట్టర్లు ఎత్తేందుకు నిపుణుల రాక
పుట్లూరు: మండలంలోని సుబ్బరాయసాగర్ వద్ద షట్టర్లు పైకి లేవకపోవడంతో నాలుగు రోజులుగా హెచ్చెల్సీ అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. సాగర్ నుంచి చెరువులకు నీటిని సరఫరా చేయడానికి షట్టర్లు ఎత్తిన సమయంలో పూర్తిస్థాయిలో లేవకపోవడంతో సమస్య ఏర్పడింది. సమస్య పరిష్కారం కోసం శివమొగ్గకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులను శనివారం రప్పించారు. వారు సమస్యను పరిశీలించిన తర్వాత షట్టర్లను పైకి లేపడానికి అవసరమైన పరికరాలను తాడిపత్రి ఆటోనగర్‌లో సిద్ధం చేయించారు. వాటి ద్వారా షట్టర్లను ఎత్తడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్లు హెచ్చెల్సీ అధికారులు తెలిపారు.
పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుదుత్పత్తి
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద ఏర్పాటైన ఏపీ జెన్ కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఏపీ జెన్‌కో ఏడీ కేశవయ్య తెలిపారు. విద్యుత్ తయారు చేసే టర్బైన్‌లో సమస్య తలెత్తి అందులోకి నీరు వస్తోందని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు 450–750 క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేయడంతో ఒక టర్బైన్‌లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చామన్నారు. రెండున్నర నెలలో 16.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందన్నారు. సాంకేతిక నిపుణులకు సమాచారమిచ్చామని, వారు వచ్చి టర్బైన్‌కు మరమ్మతులు చేపడితే తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు.
సుబ్బరాయసాగర్ షట్టర్లు ఎత్తేందుకు నిపుణుల రాక


