అధికారుల తప్పు.. విద్యార్థులకు శిక్ష
పుట్లూరు: ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం సమయానికి బస్సును నడపకపోవడంతో శనివారం కోమటికుంట్ల, గరుగుచింతపల్లి, గోపురాజుపల్లి గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే శనివారం మండలంలోని అన్ని పాఠశాలలకు కాంప్లెక్స్ సమావేశాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులను మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు. గ్రామాలకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ గరుగుచింతలపల్లి బస్సు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చామనిచెప్పి చేతులు దులుపుకుంటున్నారు.
మహిళ ప్రాణాలు
కాపాడిన పోలీసులు
గుమ్మఘట్ట: ఓ మహిళ ప్రాణాలను పోలీసులు కాపాడిన ఘటన మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు .. రాయదుర్గం పట్టణానికి చెందిన లక్ష్మీకి ప్రభుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే తాగుడుకు బానిసైన భర్త రోజూ భార్యతో గొడవ పడుతుండటంతో పోరు పడలేక అక్కడ నుంచి రాయదుర్గం పట్టణంలోని తల్లి అజ్జమ్మ వద్దకు చేరుకుని తన బాధ చెప్పుకుంది. భర్త దగ్గరే ఉండాలని తల్లి నచ్చచెప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విరక్తి చెందిన లక్ష్మీ బీటీప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బీటీపీకి చేరుకున్న ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న ఎస్‌ఐ ఈశ్వరయ్య ఆమెను రక్షించి తల్లి అజ్జమ్మకు అప్పగించారు. మహిళ ప్రాణం కాపాడడంతో ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బందిని రూరల్ సీఐ వెంకటరమణ అభినందించారు.


