రాష్ట్రస్థాయికి తొమ్మిది నమూనాల ఎంపిక
అనంతపురం సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ అన్నారు. పోటీని తట్టుకోవాలన్నా.. ఏ రంగంలోనైనా రాణించాలన్నా తొలుత నైపుణ్యం అవసరమన్నారు. బుక్కరాయసముద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన వ్యక్తిగత నైపుణ్య పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు హాజరై 250కు పైగా ప్రాజక్ట్ నమూనాలు ప్రదర్శించారు. జీసీడీఓ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీసీ శైలజ, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, జిల్లా ఒకేషనల్ అధికారి వెంకటరమణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం తొమ్మిది నమూనాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ, వారికి మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు.


