ఉద్యోగులను బానిసలుగా చూడొద్దు
● హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్
అనంతపురం మెడికల్: నిబంధనల పేరుతో ఉద్యోగులను బానిసలుగా చూస్తే ఊరుకునేది లేదని, ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ డిమాండ్ చేశారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో హంస అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అరవపాల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కొందరు ఉద్యోగులు ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలన్న ఆత్రుతతో అధిక ఒత్తిళ్లు, తదితర కారణాలతో కొందరు ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారని చెప్పారు. ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించి, వైద్య శాఖ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రీ డిప్లాయ్‌మెంట్ పేరుతో ఉద్యోగులను బానిసలకంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో హంస జిల్లా అధ్యక్షుడు షఫీ, కార్యదర్శి సంగ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పామన్న, కోశాధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు అరుణకుమారి, కార్యనిర్వహణ కార్యదర్శి డీ మహేంద్ర, నాయకులు భక్తర్ వలీఖాన్, ఎల్లప్ప, సుదర్శన్‌రెడ్డి, మంజుల, తదితరులు పాల్గొన్నారు.


