సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి

Nov 22 2025 7:04 AM | Updated on Nov 22 2025 7:04 AM

సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి

సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి

ప్రశాంతి నిలయం: ‘‘చదువంటే జ్ఞానాన్ని సముపార్జించడం కాదు.. మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికితీసి సమాజానికి పంచే సాధనం’’ అని బోధించిన సత్యసాయి తన విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలతో పాటు మానవతా విలువలు, సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను బోధించే ఆధునిక విద్యా వ్యవస్థను రూపొందించారు. ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని అధునికీకరించి... విద్యార్థిని పరిపూర్ణంగా తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానాన్ని రూపకల్పన చేశారు. సత్యసాయి ఆదర్శాలకు అనుగుణంగా నడుస్తున్న సాయి విద్యాసంస్థలు ప్రపంచంలోని మేటి విద్యాసంస్థల నరసన నిలుస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతలా పేరుగాంచిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరుగనుంది. ఇందుకోసం సెంట్రల్‌ ట్రస్టు ఏర్పాట్లు చేసింది.

1981 సంవత్సరంలో సమున్నత లక్ష్యాలతో సత్యసాయి స్థాపించిన విద్యాలయాలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ నేటితో 44 వసంతాల వేడుకను జరుపుకుంటున్నాయి. 1981లో ఆవిర్భవించిన సత్యసాయి యూనివర్సిటీకి 1986లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌లో శాశ్వత సభ్యత్వం దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా సమూల మార్పులతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థగా ఎదిగింది. 2002లో నేషనల్‌ అసోసియేషన్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌)ఏ++ గ్రేడును కేటాయిస్తూ జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థగా గుర్తించింది. 2008లో సత్యసాయి డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. నూతన ఆవిష్కరణల ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడేలా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో 2018 సంవత్సరంలో పుట్టపర్తిలోని విద్యాసంస్థలకు అనుబంధంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లోని అత్యున్నత వేదికలపై సత్యసాయి విద్యార్థులు తమదైన ముద్ర వేస్తూ సత్తాచాటుతున్నారు.

● సత్యసాయి విద్యాసంస్థల్లో 8:1 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉంటారు. 90 శాతం మంది విద్యార్థులు ఏటా ఉత్తీర్ణత సాధిస్తున్నారు.

● సత్యసాయి విద్యాసంస్థల్లో బోధించే వారిలో 74 శాతం మంది పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారే కావడం గమనార్హం.

సత్యసాయి యూనివర్సిటీ పరిధిలో నాలుగు క్యాంపస్‌లున్నాయి. రాష్ట్రంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం క్యాంపస్‌, అనంతపురంలోని మహిళా క్యాంపస్‌, కర్ణాటక రాష్ట్రంలోని ముద్దేన హళ్లి వద్ద నందగిరి క్యాంపస్‌, బృందావన్‌ క్యాంపస్‌లున్నాయి. ఈ నాలుగు క్యాంపస్‌ల ద్వారా ఏడు విభాగాల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ), ఐదు విభాగాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ), మూడు ప్రొఫెషనల్‌ కోర్సులను నిర్వహిస్తున్నారు.

నేడు స్నాతకోత్సవం

సాయి విద్యాలయాలు..

ఆధునిక దేవాలయాలు

ఆదర్శంగా నిలుస్తున్న

సత్యసాయి విద్యాసంస్థలు

నేడు సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం

ముఖ్య అతిథిగా హాజరు కానున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్టన్‌

20 మందికి బంగారు పతకాలు,

18 మందికి డాక్టరేట్లు ప్రధానం

నాలుగు క్యాంపస్‌లు..

44 వసంతాల వేడుక..

సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరగుంది. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్నాతకోత్సవ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమం 6.30 గంటలకు ముగియనుంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్‌ హాజరై విద్యార్థులకు స్నాతకోత్సవ ఉపన్యాసం, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు, డాక్టరేట్‌ల ప్రదానం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. యూనివర్సిటీ చాన్సలర్‌ హోదాలో సత్యసాయి గ్లోబల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 20 మందికి బంగారు పతకాలు, 521 మందికి డిగ్రీపట్టాలు, 14 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం పూర్ణచంద్ర ఆడిటోరియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement