బాధితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా ఉంటాం

Nov 22 2025 7:04 AM | Updated on Nov 22 2025 7:04 AM

బాధిత

బాధితులకు అండగా ఉంటాం

అనంతపురం మెడికల్‌: టీడీపీ నాయకులు కారు ఢీకొని తీవ్రంగా గాయపడి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పాతూరుకు చెందిన బాషా, ఆజాద్‌నగర్‌కు చెందిన ఇబ్రహీంలను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ సీఐ వెంకటేష్‌ నాయక్‌ను కోరారు.

31 మందికి ఉద్యోగోన్నతి

అనంతపురం రూరల్‌: పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–1గా ఉన్న 31 మందికి గ్రామ, వార్డు సచివాలయ ఆఫీసర్‌ ( మండల స్థాయి అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పించినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు తెలిపారు. ప్రమోషన్‌ పొందిన వారికి త్వరలోనే మండలాలు కేటాయిస్తామన్నారు. మండల స్థాయి అధికారులుగా పదోన్నతి పొందిన వారు వారికి కేటయించిన మండలంలో గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి

అనంతపురం మెడికల్‌: జిల్లాలో నూతనంగా ప్రారంభించే ప్రైవేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు, క్లినిక్‌ల నిర్వాహకులు హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబ దేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. పోర్టర్‌లో నమోదు చేసుకోని వారు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ను అనుసరించి ఆస్పత్రి అనుమతి, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల వారు కూడా 15 రోజుల్లో తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో వారి లైసెన్స్‌ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలి

శబరిమలకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ముక్కు మూసుకుని, నది నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఎటువంటి ఇన్‌ఫెక్షన్సూ దరి చేరవన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం

అనంతపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తాడిపత్రికి చెందిన కంచం రామ్మోహన్‌రెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అక్రమ లేఅవుట్లకు సహకరిస్తే చర్యలు

డీపీఓ హెచ్చరిక

అనంతపురం రూరల్‌: పంచాయతీ అధికారులు అక్రమ లే అవుట్లకు సహకరిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం అక్రమ లేఅవుట్లపై ‘తమ్ముళ్ల రియల్‌ దందా’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనానికి ఆయన స్పందిచారు. అహుడా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వెంచర్లను ఎప్పటిక్పప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందన్నారు జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం తగదన్నారు. పంచాయతీ ఆదాయాలకు గండికొట్టే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి పంచాయతీ, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి పంచాయతీల్లో వెలసిన అక్రమ లేఅవుట్లపై నివేదిక ఇవ్వాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు.

బాధితులకు అండగా ఉంటాం 1
1/2

బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం 2
2/2

బాధితులకు అండగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement