పంటల బీమా పథకాలు అస్తవ్యస్తం
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పంటల బీమా పథకాలపై చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. అమలులోకి వచ్చినట్లు చెబుతున్నా... రైతులు వినియోగించుకునేలా వ్యవసాయశాఖ ఇంకా బహిరంగ ప్రకటన చేయకపోవడం విశేషం. 2019–24 మధ్య కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ–క్రాప్ ఆధారంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. రైతులపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా అమలు చేయడంతో పాటు నాలుగేళ్ల పాటు పెద్ద మొత్తంలో బీమా కింద పరిహారం అందించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాగానే గత రబీ నుంచి ఉచిత బీమా పథకాలకు మంగళం పాడింది. రైతులపై ప్రీమియం భారం మోపడంతో పాటు బీమా పథకాలను అస్తవ్యస్తంగా మార్చేశారు. 2023 ఖరీఫ్, రబీ, 2024 ఖరీఫ్, రబీకి సంబంఽధించి ఇప్పటికీ బీమా కింద రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
బీమా పథకాలపై ప్రకటనేదీ?
అనధికార సమాచారం ప్రకారం ఈ రబీలో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఫసల్‌బీమా, అలాగే వాతావరణ బీమా కింద టమాటకు బీమా వర్తింపజేశారు. వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం చొప్పున బీమా ప్రీమియం డిసెంబర్ 15 లోపు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.450 ప్రకారం, వేరుశనగ ఎకరాకు 480, జొన్నకు రూ.315, మొక్కజొన్నకు రూ.325, వరికి రూ.630, టమాటకు రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలి. రుణాలు పొందుతున్న రైతులు బ్యాంకుల్లోనూ, రుణాలు లేని రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్‌సీ), సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్‌సీఐపీ)లో తమ వాటా చెల్లించాలి. మామిడి పంటకు బీమా వర్తింపజేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బీమా కింద నోటిఫై అయిన పంటలు, పథకం వివరాలు, ప్రీమియం, ఆఖరి గడువు తదితర అంశాలపై వ్యవసాయశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవతున్నాయి.
రబీ పంటల బీమాపై చంద్రబాబు సర్కారు మౌనం
అమలులో ఉన్నా.. ప్రకటన చేయని వ్యవసాయశాఖ


