జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
‘మీ డబ్బు.. మీ హక్కు’పై
అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్: లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఖాతాల్లో నిలిచిపోయిన సొమ్మును డిపాజిటర్లు లేదా వారి వారసులకు చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బ్యాంకర్లకు సూచించారు. జేసీ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో లీడ్ బ్యాంక్ మేనేజర్ నరేష్‌రెడ్డి, బ్యాంకర్లతో కలిసి ‘మీ డబ్బు.. మీ హక్కు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ జిల్లాలో క్లెయిమ్‌లు కాని ఖాతాలు మొత్తం 4.87 లక్షలు ఉన్నాయన్నారు. వీటిలో రూ.107.65 కోట్లు నిల్వ ఉందన్నారు. వీటిలో వ్యక్తిగత డిపాజిటర్ల ఖాతాల్లో రూ.86.74 కోట్లు, సంస్థాగత ఖాతాల్లో రూ.8.80 కోట్లు, ప్రభుత్వ ఖాతాల్లో రూ.12.1 కోట్లు ఉన్నాయన్నారు. క్లెయిమ్‌లు కాని ఈ డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రజలకు బ్యాంకులు సులభమైన మార్గాలను అందుబాటులో ఉంచాయన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ డీఎం హేమంత్, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.


