నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం బందోబస్త్‌కు వచ్చిన డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శనివారం ఉదయం 10.50 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో బయలుదేరి హిల్ వ్యూ స్డేడియం చేరుకుని సత్యసాయి బాబా జయంత్యువాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యే కాన్యాయ్‌లో ప్రశాంతి నిలయానికి వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం, కాన్వాయ్ వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విమానాశ్రయం నుంచి సాయి కుల్వంత్ హాలుకు వెళ్లే సమయంలో బందోబస్త్‌పాయింట్లలలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే పబ్లిక్ గ్యాలరీల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్‌లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు ఆర్‌ఐలు పాల్గొన్నారు.


