కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
విడపనకల్లు: వీధి కుక్కల దాడిలో 18 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుబ రవి, గురుస్వామి శుక్రవారం ఉదయం 65 గొర్రె పిల్లలను స్థానిక జెడ్పీ హైస్కూల్ వద్ద పొలంలో ఏర్పాటు చేసిన దొడ్డిలో భద్రపరిచి మిగిలిన గొర్రెలను మేపునకు అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లారు. ఎవరూ లేని సమయంలో కుక్కలు దొడ్డిలోకి చొరబడి 18 గొర్రె పిల్లలను కొరికి చంపేశాయి. మిగిలినవి గాయాల పాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. దాదాపు రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.


