రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కళ్యాణదుర్గం: జిల్లాలో రైతులు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద మొక్కజొన్న, కంది, అరటి పంటలను పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో రంగయ్య మాట్లాడారు.
చంద్రబాబు పాలనలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రూ.లక్షలు వెచ్చించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు సైతం చేతికి అందడం లేదన్నారు. అరటికి ధర లేక పొలాల్లోనే దున్నేస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ పీఎం కిసాన్ రైలును పునరుద్ధరించి, పంట దిగుబడులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే కొద్ది వరకై నా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అరటి, ఆలు, ఎర్రగడ్డ, అరటి పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటా కందికి ప్రభుత్వం రూ.8 వేలు, మొక్కజొన్న క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రూ.6 వేలతో కంది, రూ.1,600లతో మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. అమెరికా, లండన్ నుంచి విశాఖకు పరిశ్రమలు తెస్తామని రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని గొప్పలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు రైతుల గురించి కనీసం ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి డీఆర్‌డీఏ, వెలుగు కార్యాలయాల ద్వారాా మహిళా సంఘాల సభ్యులతో పంటల కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం లోపు ఈ ప్రక్రియ చేపట్టకపోతే రైతులతో కలిసి ఉద్యమాలకు తెర లేపుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శోభారాణి, జెడ్పీటీసీ బొమ్మన్న, ఎంపీపీలు మారుతమ్మ, భీమేష్, పార్టీ కన్వీనర్లు చంద్రశేఖర్ రెడ్డి, కదిరిదేవరపల్లి రాయుడు, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు పాటిల్ అభిలాష్, పాతలింగ, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, బలరాం, కేశవరెడ్డి, గోళ్ల మోహన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సత్తిరెడ్డి, సంజప్ప, అంజినరెడ్డి, కొండారెడ్డి, రామిరెడ్డి, దొడగట్ట నారాయణ, సర్పంచ్ హనుమంతప్ప, జయరామిరెడ్డి, మంజునాథ రెడ్డి, మహదేవరెడ్డి, వైఎస్ చిత్తయ్య, గణేష్, రాము, హనుమంతరెడ్డి, మల్లికార్జున, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ రైలు సేవలను పునరుద్ధరించాలి
పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి
వారంలోపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఉద్యమం తప్పదు
మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య


